Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఐసోలేషన్ ఏర్పాటు
- ఉచితంగా పౌష్టికాహారం, మందులు పంపిణీ
- నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రతి రోజూ రోగుల బంధువులకు అన్నదానం
నవతెలంగాణ - నల్లగొండ
ప్రజా సమస్యలపై పోరాటాలే కాదు..ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ కమ్యూనిస్టులు ముందుంటున్నారు. కరోనా వచ్చి ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారికి ఉచితంగా వైద్యంతో పాటు ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉచితంగా మందులు ఇస్తున్నారు. అత్యవసరమైతే ప్రభుత్వాస్పత్రికి తరలించి ఆక్సీజన్ అందిస్తున్నారు. అంతే కాదు లాక్డౌన్ కాలంలో హోటళ్లు బంద్ ఉండి భోజనం కోసం అల్లాడుతున్న నల్లగొండలోని ప్రభుత్వాస్పత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులకు ప్రతి రోజూ అన్నదానం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నల్లగొండలోని ఎంవీఎన్ ట్రస్ట్ భవనంలో 15 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకూ 20 మంది కరోనా రోగులు చికిత్స పొందారు. ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న రోగులకు ప్రతి రోజూ పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నారు. అంతే కాదు ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఈ కేంద్రంలో చికిత్స పొందిన కొందరికి నెగిటివ్ రావడంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో ప్రయివేటు ఆస్పత్రుల వైద్యులతో రోగులకు ప్రతి రోజూ మూడుసార్లు చెకప్ చేస్తున్నారు. అంతేకాక రోగులకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతుండటంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి దగ్గరుండి మరీ సేవలందిస్తున్నారు.
వివిధ వర్గాల ప్రజల సహకారంతో రోగులకు అన్నదానం
లాక్డౌన్ వల్ల పట్టణంలో హోటళ్లు బంద్ కావడంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి బంధు వులు ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలు చూడలేక సీపీఐ(ఎం) నాయకులు ముందుకొచ్చి వివిధ వర్గాల ప్రజల సహకారంతో ప్రతి రోజూ 150 మంది రోగులు, వారి బంధువులకు అన్నదానం చేస్తున్నారు.