Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం లాభాల బాటలో పయనం
- 'నవతెలంగాణ'తో ముఖాముఖిగా చైర్మెన్ ఆలకుంట్ల నాగరత్నంరాజు
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయప్రతినిధి
కష్టించి పనిచేస్తే వ్యక్తి అయినా సంస్థ అయినా ఆర్ధికంగా అభివృద్ధిలోకి రావాల్సిందే.. అలాంటి సంస్థలలో జిల్లా కేంద్రానికి చెందిన గొల్లగూడ ప్రాథమిక సహకార సంఘం( పీఏసీఎస్). గతేడాది అప్పుల్లో కూరుకుపోయింది. నూతనంగా పాలకవర్గం బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పులు పోయి లాభాల బాటలోకి పయనం సాగిస్తుంది. రైతులకు ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుని ఉమ్మడి జిల్లాలోనే అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసిన సంఘం ఇది. అంతేగాకుండా పంటరుణాలు కూడా గతంలో కంటే ఈసారి అదనంగా ఇవ్వాలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇదే విషయాన్ని సంఘం చైర్మెన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు నవ తెలంగాణాతో పంచుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొదటిస్థానం
ధాన్యం కొనుగోలులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మొదటిస్థానం గొల్లగూడ పీఏసీఎస్. సుమారు 2.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 3252 మంది రైతుల నుంచి సేకరించారు. ఆ ధాన్యం విలువ రూ.47,28,25000 అయితే ఇప్పటివరకు రూ.20కోట్ల డబ్బులను రైతుల ఖాతాలో జమచేశాం. ఈ ధాన్యం సేకరణ వల్ల తమకు దాదాపు రూ.80లక్షల కమిషన్ రానుంది. అయితే కొంత మంది డబ్బులు ఆలస్యంగా రావడానికి గల కారణం మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి కాకపోవడంతో ఆన్లైన్ ట్యాగ్ కావడంలేదు. దానివల్ల తమ సిబ్బంది ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేయలేకపోతున్నారు. గతేడాది దాదాపు 1.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించాం. దానికి సంబందించిన కమీషన్ సుమారు రూ.56లక్షలు తమ సంఘానికి అందాల్సి ఉంది.
గతేడాది కంటే ఎక్కువ రుణాల చెల్లింపు కోసం కృషి...
తమ పిఏసిఎస్ ద్వారా సుమారు కోటి 50లక్షల పంటరుణాలను దాదాపు 300 మంది రైతులకు అందించాం. అయితే తిరిగి చెల్లింపులు కూడా నడుస్తున్నాయి. ఈసారి గతాని కంటే అధికంగానే రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఒకటి, రెండు రోజుల్లో పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేయనున్నాం. అందులో చర్చించి రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో పాలకవర్గం సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాం. తామంతా కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే లాభాలలోకి వచ్చాం.
యూరియా అమ్మకాలు....
రైతులు పెద్దఎత్తున సాగు చేస్తున్నందున తమ సంఘం సభ్యులకు ఎరువులు అందడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదనే లక్ష్యంతో యూరియాను మాత్రమే రైతులకోసం విక్రయిస్తున్నాం. గత యాసంగిలో సుమారు 200 టన్నుల యూరియా రైతులకు అమ్మినం. ఈసారి కూడా రైతులకు అవసరమైన మేరకు యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో తమ సంఘం ఏలాంటి లాభపేక్ష లేకుండానే రైతులకు సర్వీస్ మాత్రమే చేస్తుంది.
ప్రస్తుతం లాభాల బాటలో.......
గత పాలకవర్గం పాలనలో సోసైటీ దాదాపు రూ.60లక్షలు అప్పుల్లో ఉండేది. ఈసారి అప్పులు తీర్చుకున్నాం. లాభాల్లో ఉన్నాం. అయితే ఎంత లాభం సంఘానికి వచ్చిందనే విషయం ఈసారి ఆడిట్లో తెలుస్తుంది. పాలకవర్గం సభ్యుల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ లాభాలు సాధించాం. ఈసారి ధాన్యం సేకరణలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారం మరువలేనిది, ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాం. అయితే తమ సంఘానికి సొంత భవనం ఇప్పటి వరకు లేదని త్వరలోనే ఎమ్మెల్యే సహకారంతోనే ఆ భవనం కూడా నిర్మించుకోబోతున్నాం.