Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
కులాలవారీగా ఉపాధికూలీలకు వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పులుసు సత్యం అన్నారు.ఆదివారం మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 21న కలెక్టరేట్ ముందు ధర్నా, 22న మండల, గ్రామ సచివాలయాల ముందు జరిగే నిరసనను జయప్రదం చేయాలని కోరారు.ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం నిధులను ఉపాధిహామీ చట్టానికి వర్తింప జేసి, జాబ్ కార్డులను విడగొట్టాలన్న నిర్ణయం వల్ల వేతనాల చెల్లింపులో ఆ సామాజిక తరగతులకు తీవ్ర అన్యాయం జరుగు తుందన్నారు.గ్రామాల్లో సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించాలనే సదుద్దేశంతో తెచ్చిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ కులాల వారీగా వేతనాలు ఇవ్వాలని చూడడం సరిగాదన్నారు.అణగారిన ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభాకు తగిన విధంగా ప్రత్యేక నిధులను కేటాయించి, ఖర్చు చేసేందుకు వచ్చినదే సబ్‌ప్లాన్ చట్టమన్నారు.దీంతో ఉపాధిపనులను అనుసంధానం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కల్లేపల్లి భాస్కర్, నాయకులు రామ్మూర్తి వెంకన్న, మల్లయ్య,సోమయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.