Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులాల వారీగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వాలనేది సరికాదు
- కలెక్టరేట్ ఎదుట వ్యకాస, కేవీపీఎస్ ధర్నా
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
కులాల వారీగా ఉపాధి కూలీల వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట వ్యకాస, కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న కూలీలను ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాలుగా విభజించి వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం మెమో తీసుకు రావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం నిధులను ఉపాధిహామీ చట్టానికి వర్తింపజేసి, జాబ్ కార్డులను విడ గొట్టాలన్న నిర్ణయం వల్ల వేతనాల చెల్లింపులో ఆ సామాజిక తరగతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభాకు తగిన విధంగా ప్రత్యేక నిధులు కేటాయించి, ఖర్చు చేసేందుకు వచ్చిందే సబ్‌ప్లాన్ చట్టమని, దీంతో ఉపాధిహామీ పనులను అనుసంధానం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా కాలంలో ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి, అర్బన్ ప్రాంతాలకు కూడా ఈ విస్తరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే కూలీలను కులాలవారీగా విభజించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. అనంతరం అదనపు కలెక్టర్ మోహన్‌రావుకు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సుందరి కిరణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, జిల్లా సహాయ కార్యదర్శి బచ్చలకూర రామ్ చరణ్, జిల్లా నాయకులు తీగల లింగయ్య, వెంకన్న, రాములు, మల్లమ్మ, మంజుల, కవిత, బచ్చలకూర సైదులు, ముత్తయ్య, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.