Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరుతూ మండలంలోని సూరెపల్లి గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దష్టికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐకేపీ ధాన్యం కోనుగోలు కేంద్రం నుంచి బస్తాలు రైసుమిల్లుకు వెళ్లిన తరవాత అక్కడ వెంటనే లారీల నుంచి అన్లోడ్ చేయడం లేదని. ధాన్యం బస్తాలను లారీ నుంచి దించిన తరవాత ప్రతి బస్తా నుంచి 4 కిలోల చొప్పున తరుగు పేరుతో మిల్లర్లు తీసి పక్కన పెడుతున్నారని ఆరోపించారు. తరుగు తీయాలా వద్దా అని రైతును ముందే అడుగుతున్నారని. రైతులు వద్దని గట్టిగా చెపితే 'అయితే ధాన్యంలో నాన్యత లేదు, వెనక్కి తీసుకెళ్లండి' అని మిల్లర్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరి కోతలు రాష్ట్రవ్యాప్తంగా యంత్రాలతో చేస్తుండడం వల్ల ధాన్యంలోకి మట్టి వచ్చే అవకాశమే లేదని.వారు అన్నారు. పైగా తాలు లేకుండా ఉండేందుకు భారీ ట్రాక్టర్ యంత్ర ఫ్యాన్లతో తూర్పార పట్టామన్నారు. ఫ్యాన్‌కు గంటకు రూ.2 వేల చొప్పున కిరాయి, తూర్పారబట్టే మనుషులకు గంటకు రూ.200 చొప్పున చెల్లించి ధాన్యంలో ఏమీ లేకుండా చూసుకున్నట్టు తెలిపారు. వర్షంలో సైతం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. అయినా ధాన్యంలో నాన్యత సరిగా లేదని, ధాన్యం నాసిరకంగా ఉందంటూ బెదిరించి తరుగు తీస్తుండటంతో ఆరుగాలం చేసిన కష్టం, ఖర్చులకు ఎలాంటి ఫలితం ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు. ధర్నా నిర్వహించిన వారిలో గ్రామ సర్పంచ్ బొడ్డు లక్ష్మమ్మ మైసయ్య, గ్రామస్తులు సుధాకర్ , అంజయ్య, సత్తిరెడ్డి, మైసయ్య, సత్యనారాయణ ,శంకరయ్య, బాలమ్మ, గంగమ్మ ,అరుణ, అలివేలు, రైతులు ఉన్నారు.