Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజులుగా పత్తా లేని చినుకు జాడ
- వాడిపోతున్న పత్తి మొక్కలు
- ఆందోళనలో రైతులు
నవతెలంగాణ-మోత్కూరు
వానాకాలం తొలకరిలో కురిసిన వర్షాలు ప్రస్తుతం వారం, పది రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. రోజూ సాయంత్రం కాగానే వర్షం పడుతుందన్నట్టుగా నల్లని మబ్బులు పట్టడం, గాలి వీస్తుందే తప్ప చినుకు మాత్రం రాలడం లేదు. గత మూడు, నాలుగు రోజులుగా ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువైంది. తొలకరి వర్షాలతో మురిసిపోయిన రైతులు బలమైన కార్తెలు వెళ్లిపోతుండటంతో పత్తి గింజలు విత్తారు. అవి మొలకెత్తి మొక్క దశలో ఉన్నాయి. వారం, పది రోజులుగా వానలు పడకపోవడంతో పత్తి మొక్కలు వాడ్పు ముఖం పట్టి ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాడిపోతున్న పత్తి మొక్కలు...ఆందోళనలో రైతులు
మగశిర కార్తెకు ముందే రోహిణి కార్తెలోనే తొలకరి వానలు పడటంతో రైతులు సంతోషంగా సాగు పనులు మొదలెట్టారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22 లక్షల 12,632 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో పత్తి 8.10 లక్షలు, వరి 3.65 లక్షలు, 35 వేల ఎకరాల్లో కందులు, సూర్యాపేట జిల్లాలో వరి 4,25,527 ఎకరాల్లో, పత్తి 1,39,514 ఎకరాల్లో, కంది 18,869, జొన్న 299, పెసర 11,484 ఎకరాల్లో, యాదాద్రి జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి, పత్తి 1.95 లక్షల ఎకరాలు, కంది 46 వేల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. కాగా తొలకరి వర్షాలతో రైతులు 50 శాతానికి పైగా పత్తి పంట సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరాకు పత్తి గింజలకు, దున్నకాలకు, కూలీలకు రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న పత్తి చేలు వారం, పది రోజులుగా చినుకు పడకపోవడం, దంచి కొడుతున్న ఎండలు, ఉక్కపోత కారణంగా మొక్కలు వాడిపోతున్నాయి. చేలల్లో పదును పోకుండా, మొక్కలు వాడిపోకుండా రైతులు రోజు విడిచి రోజు పత్తి చేలల్లో గుంటుక తోలుతున్నారు. యాసంగి పంట అమ్ముకునే సమయంలో అకాల వర్షాలు కురిసి పంట దెబ్బతిని నష్టపోయామని, ఇప్పుడు కురవాల్సిన సమయంలో వానలు పడక పోవడంతో పత్తి ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తొలకరి వానలకే తొందర పడి విత్తనాలు వేయవద్దని, వానలు పడకుంటే నష్టపోతారని, వర్షాలు ఎక్కువగా కురిసే సమయంలోనే మెట్ట పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ఐదు ఎకరాల్లో పత్తి వేశా
కంబాల వీరయ్య, లక్ష్మీదేవికాల్వ, అడ్డగూడూర్ మండలం
నేను ఐదు ఎకరాల్లో పత్తి వేశా. తొలకరి వానలకు వేయకుంటే పంట వెనకపడి పోతుందన్న ఉద్దేశంతో పత్తి గింజలు విత్తాను. గింజలు మంచిగా మొలకెత్తాయి. వారం రోజులుగా వానలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో వాన పడక పోతే నష్టపోతాం.