Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మగౌరవానికి ప్రతిక డబల్ ఇండ్లు
- అభివృద్ధిపై ఆకస్మిక తనిఖీ చేస్తా
- పారిశుధ్యంపై మంత్రి పువ్వాడ అసహనం
నవతెలంగాణ-కారేపల్లి
కోవిడ్ సంక్షోభంలోను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ఆపలేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. కారేపల్లి మండలంలోని తవిసిబోడు, విశ్వనాధపల్లి గ్రామాల్లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసంధర్బంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ పల్లెలు బాగుపడాలనే కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలోని 12 వేల గ్రామపంచాయతీలకు ప్రతి నెల నిధులు అందిస్తుందన్నారు. సీఎం ఆశించిన ప్రగతి రాబట్టటానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. జూలై 1-10 వరకు జరిగే ప్రల్లె ప్రగతిలో స్వయంగా పాల్గొంటానన్నారు. జీపీలకు పారిశుధ్యంకు నిధులు ఇస్తుందని వాటిని సక్రంగా వినియోగించాలన్నారు. సింగరేణి మండలంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళుతానని హామీ ఇచ్చారు.
పారిశుధ్యంపై మంత్రి అసహనం
విశ్వనాధపల్లి డబల్ ఇండ్ల ప్రారంభానికి వస్తున్న మంత్రి పువ్వాడను లింగంబంజర గ్రామస్తులు తమ వీధులను పరిశీలించాలని కోరారు. ఆ గ్రామంలో వీధులో బురద ఉండంపై సర్పంచ్ ఇందిరాజ్యోతి, కార్యదర్శి రాజకుమార్లను ప్రశ్నించారు. సీసీ రోడ్డు లోతట్టుగా ఉందని గ్రామస్తులు వాడకం నీరు వస్తున్నాయని తెల్పగా వారికి నోటీసులివ్వాలన్నారు. ఈ వీధులో రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. తడి, పోడి చెత్తను సేకరించక పోవటంపై ఆసహనం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న స్మశాన వాటిక పనులు అసంపూర్తిగా ఉండటంపై ప్రశ్నించారు. గ్రామంలో హరితహారం మొక్కలు కనిపించటం లేదని సర్పంచ్‌ను అడగా ఉన్నాయని, మొక్కలు చూపుతానని సర్పంచ్ పేర్కొన్నారు. ఉపసర్పంచ్ కార్యక్రమానికి హాజరుకాకపోవటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ సూరపురెడ్డి జయశ్రీ కార్యక్రమానికి రాకున్నా ఆమె వార్డులో సీసీ రోడ్డు మంజూరు చేశామని ప్రశంసిస్తూ మెసేజ్ పెట్టండని వ్యంగ్యంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీకర్ణన్, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, అడిషనల్ కలెక్టర్ స్నేహలత, డీఆర్వో శిరీషా, ఆర్డీవోరవీంద్రనాధ్, పీఆర్‌ఈఈ జీవీ.చంద్రమౌళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పుష్పలత, పీఆర్డీఈ వెంకటరెడ్డి, మండల స్పెషల్ ఆపీసర్ ఆజరుకుమార్, వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్‌లు హలావత్ ఇందిరాజ్యోతి, భూక్యా రమణ, ఎంపీటీసీలు వడ్డె అజరుబాబు, ధర్మసోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిధులివ్వకుండా అభివృద్ధి ఎలా సాధ్యం : సర్పంచ్ ఇందిరాజ్యోతి
పంచాయతీలల్లో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని సర్పంచ్ హలావత్ ఇందిరాజ్యోతి ప్రశ్నించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ లింగంబంజర గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని, అన్ని నిధులు గ్రామపంచాయతీలో ఉంటాయా అని అన్నారు. గ్రామపంఛాయతీకి రూ.2లక్షలు ఇస్తున్నారని వాటితోనే ట్రాక్టర్ కిస్తీలు, కరెంట్ బిల్లులు, పంఛాయతీ సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, వీధులైట్లు, పారిశుధ్యపనులు చేయాల్సి ఉందని ఇక రోడ్ల నిర్మాణానికి నిధులు ఏవన్నారు. సర్పంచ్‌లను ప్రశ్నించటం కాదని నిధులు విడుదల చేయాలని కోరారు. 7 ఏండ్ల క్రితం ఈజీఎస్ ద్వారా నిర్మించిన స్మశాన వాటిక రేకులు గాలి దుమారానికి లేచి పోతే దానికి మరమ్మత్తులు చేయిస్తున్నా మన్నారు. హరితహారంలో రోడ్డు ఇరువైపుల మొక్కలు కనిపిస్తున్నా మొక్కలు లేవంటూ మంత్రి వ్యాఖ్యానించటం విచాకరమన్నారు. స్ధానిక టీఆర్ఎస్ నాయకుల ప్రోద్భలంతో మంత్రి తమను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
వైద్య సిబ్బందిని ప్రశంసించిన కలెక్టర్
కారేపల్లి మండలంలో కరోనా ఉదృతిలో వైద్య సేవలందించి కోవిడ్ నియంత్రణ చేసిన వైద్య సిబ్బంధిని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రశంసించారు. బుధవారం కారేపల్లి మండలం తవిసిబోడు, విశ్వనాధపల్లిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభానికి వచ్చిన కలెక్టర్ మాట్లాడుతూ కారేపల్లి మండలంలో తీవ్రరూపం దాల్చిన సమయంలో ఇంటింట తిరిగి వైద్య సేవలందించిన ఆశాల దగ్గర నుండి వైద్యుల వరకు సేవందించారన్నారు. రెవిన్యూ, పోలీసు, మండలపరిషత్ అధికారులు కరోనా బాధితులను చైతన్యం చేసి ఐసోలేషన్ కేంద్రాలకు తరిలించి చికిత్స అందించటంద్వారా అదుపులోకి తెచ్చామన్నారు. పల్లె ప్రగతి అమలులో రాక ముందు జిల్లాలో 1000 డెంగ్యూ కేసులు నమోదు కాగా పల్లెప్రగతి అమలు అయిన తర్వాత 20 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టటం ద్వారా ఇది సాధ్యమైందన్నారు. జిల్లాలో ఉన్న 578 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, సెగ్రేషన్ షెడ్డు, స్మశాన వాటిక, ట్రాక్టర్, నర్సరీ నూరుశాతం పూర్తి అయ్యాయన్నారు. కొన్ని గ్రామాల్లో వీటిని వినియోగంలోకి తేవటం లేదన్నారు. పని చేయాని సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఉపసర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిగా పని చేసిన వారికి సన్మానం చేస్తామన్నారు. పల్లె ప్రగతిలో మాస్కులు, భౌతికదూరం పాటిస్తూ ఆందరు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
మంత్రి వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) ఖండన
గిరిజనుల పోడు సమస్యపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌కు వినతిపత్రం ఇవ్వటానికి వెళ్ళిన సీపీఐ(ఎం) నాయకులను బుద్ది ఉందా అని మంత్రి వ్యాఖ్యానించటాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర ఖండించారు. తవిసిబోడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం కారేపల్లి మండల తవిసిబోడులో డబల్‌బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభానికి వచ్చిన మంత్రి మాట్లాడుతుండగా సభలో రచ్చచేయవద్దని తర్వాత వినతిపత్రం ఇవ్వాలని కోరగా ఆ ప్రకారం మంత్రికి వినతిపత్రం ఇవ్వటానికి సీపీఐ(ఎం) బృందం వెళ్ళగా మంత్రి అనుచితంగా వ్యాఖ్యనించారన్నారు. ఈప్రాంతంలో 70శాతం పోడు భూములపై ఆధారపడ్డారని ఆ రైతులను ఫారెస్టు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఫారెస్టు అధికారులు గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే మంత్రి పోడు రైతుల గోస పట్టించుకోలేదన్నారు. మంత్రి ప్రసంగంలో కూడా పోడు రైతుల ఊసే ఎత్తకుండా ముగించారని దీనిని బట్టి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల చిన్నచూపు అర్ధం అవుతుందన్నారు. చీమలపాడులో 2016లో శంకుస్ధాపన చేసిన డబల్ ఇండ్లు పునాదులు, పిల్లర్లకే పరిమితమైనాయని వాటిని ఎందుకు పరిశీలించలేదన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎర్రిపోతు భద్రయ్య, యనగండ్ల రవి, లక్ష్మణ్, మాలోత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.