Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం బియ్యం సరఫరా
- తినలేక ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, చిన్నారులు
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యం తినేవారంతా పేదలు, చిన్నపిల్లలు. అందుకేనేమో ఎందుకూ పనికి రాని బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. 'తింటే తినండి లేదా మీ ఇష్టం' మేమైతే గివే ఇస్తాం.. అంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. తుట్టెలు పట్టిన బియ్యం వండలేక, వండినా తినలేక కేంద్రాలకు వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లాలో 1831 ఐసీడీఎస్ కేంద్రాలున్నాయి. వాటిలో ప్రధాన కేంద్రాలు 1831 ఉండగా మినీ కేంద్రాలు మరో 262 ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పొందుతున్న పిల్లలు 77,859 మంది ఉన్నారు. అందులో బాలురు 40,508, బాలికలు 37,351 ఉన్నారు. అంతే కాకుండా పూర్వ ప్రాథమిక విద్య పొందుతున్న పిల్లలు 31,150 మంది ఉన్నారు. వారిలో బాలురు 25,955, బాలికలు 15,195 మంది ఉన్నారు. వీరే కాకుండా మహిళలు మొత్తంగా 23,887 మంది లబ్ది పొందుతున్నారు. వారిలో గర్భిణులు 10,668 మంది, బాలింతలు 12,419 మంది ఉన్నారు.
తుట్టెలు కడుతున్న బియ్యం సరఫరా
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం అందిస్తున్నారు. పౌష్టికాహారం అక్కడే లబ్దిదారులకు అందుతుంది. కానీ ఇప్పుడు కేంద్రాలకు వచ్చే బియ్యం పూర్తిగా తుట్టెలు కట్టి ఉంటోంది. అంతే కాకుండా లక్క, తెల్లపురుగు, ఇతర పురుగులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి వద్దని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే డీలర్లకు ప్రభుత్వం సరఫరా చేసింది ఆ బియ్యమే కాబట్టి...తమకు వచ్చిన బియ్యం ఇస్తున్నామని.. తామేమీ చేయలేమని డీలర్లు చెబుతున్నారు. కేంద్రాల్లో ఏమరుపాటి తప్పి ఏవరైనా వాటిని సరిగా శుభ్రం చేయకుండా వండితే అందులో పురుగులు ఉడికిన వాసనే వస్తుంది. ఇదిలా ఉంటే పప్పుదినుసుల పరిస్థితి కూడా అలాగా ఉంది. పప్పుకు రంధ్రాలు పడి అందులో పురుగులు కనిపిస్తున్నాయి. ఒకవేళ చూడకుండా అలాగే వండితే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్గత సమావేశాల్లో టీచర్లు తమ అధికారులకు విషయం చెబుతున్నా ఫలితం రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సన్న బియ్యం ఉత్తిమాటేనా...?
అంగన్వాడీ కేంద్రాలు, బడుల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎక్కడా సన్న బియ్యం కేంద్రాలకు సరఫరా చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.