Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలకు విరుద్ధంగా దుకాణం ఏర్పాటు..
- ఎంఆర్పీ ధరకే జనరిక్ మందుల అమ్మకం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కేంద్ర వైద్యశాలలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ప్రయివేటు మెడికల్ దందా నడుస్తోంది. సుమారు నాలుగు నెలల క్రితం ఎంసీహెచ్లోని రిసెప్షన్ కౌంటర్లో జన ఔషధి ఫార్మసీ పేరుతో మందుల దుకాణం ఏర్పాటు చేశారు. వాస్తవంగా ప్రభుత్వ దవాఖానాలో ప్రయివేటు వ్యక్తులకు ఎలా అనుమతి లభించిందో అర్థం కాని విషయం. ఈ ఎంసీహెచ్ వార్డు ఏర్పాటు తర్వాత ఔట్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగింది. గర్భిణులు, బాలింతలు అధికంగానే వస్తున్నారు. అయితే వీరికోసం ప్రభుత్వ ఫార్మసీని ఏర్పాటు చేసి డాక్టర్లు రాసిన మందులను ఉచితంగానే అందజేశారు. అందరికీ ఉచిత మందుల దుకాణం అందుబాటులోకి వచ్చిందనే భావనలో పెషేంట్లు అనుకుంటుండగానే దానిని రెండేండ్లుగా మూసేశారు. ఇదిలా ఉంటే ప్రయివేటు వ్యక్తికి మందుల దుకాణం ఏర్పాటు చేయడానికి ఆస్పత్రివర్గాలు అనమతి ఇవ్వడం పట్ల పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వ దవాఖానాలో మందుల దుకాణం ఏర్పాటు చేయడానికి అనుమతి ఉండాలి. గతంలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని జిల్లా మహిళా సమాఖ్యకు అనుమతి ఇచ్చారు. కానీ ప్రయివేటు వ్యక్తి ఏకంగా ప్రభుత్వం హాస్పిటల్లో మెడికల్ షాపు ఏర్పాటు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అంతుచిక్కని ప్రశ్న.
ఎమ్మార్పీ ధరకే జనరిక్ మందులు...
ప్రతి మనిషి తన సంపాదనంలో ఎక్కువ భాగం వైద్యానికే ఖర్చుచేయాల్సిన పరిస్థితి దాపురించింది. మెడిసిన్ అమ్మకంలో సగానికి సగం లాభం వస్తుందని వ్యాపారులే చెపుతుంటారు. అందుకే ఈ మధ్య జనరిక్ మందుల వాడకం బాగా పెరిగింది. ఎందుకంటే నాలుగు రూపాయల మందు బిల్ల ... జనరిక్ మెడికల్ షాపులో అయితే ఒక్క రూపాయికే కొనుగోలు చేయొచ్చు. అంటే ఈ రెండింటి మధ్య తేడా భారీ స్థాయిలోనే ఉంటుంది. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన జన ఔషధి ఫార్మసీలో జనరిక్ మందులు తెచ్చి వాటిని పూర్తిగా ఎమ్మార్పీ ధరకే విక్రయిస్తున్నారు. ఇదేంటనీ ఎవరైన రోగులు అడిగితే ఇక్కడ అలాగే ఉంటాయని సమాధానం దాటవేస్తున్నారు. ఇలా ఇష్టమొచ్చిన రీతిలో మెడిసిన్ అమ్ముతూ రోగుల నుంచి పెద్దఎత్తున సొమ్మును దోచుకుంటున్నారు.
సిబ్బందికి చేతివాటం ?
ఎంసీహెచ్ వార్డులో సుమారు ఇన్పేషెంట్లు 300 వరకు, ఔట్ పెషేంట్ల సంఖ్య ప్రతి రోజూ 250 వరకూ ఉంటుంది. సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రభుత్వ ఫార్మసీని మూసివేయడంతో ఇన్పెషేంట్లు, ఔట్పెషేంట్లు అందరూ ఈ మందుల దుకాణం నుంచే మందులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు కూడా అవసరమైన మెడిసిన్ ఇక్కడే కొంటున్నారు. సూది (నిడిల్) నుంచి గ్లూకోజ్ వరకు అన్ని ఇక్కడే కొనుగోలు చేయిస్తున్నారు. అయితే కొంత మంది సిబ్బంది ఈ దుకాణం ఏర్పాటు వెనుక ఉండి నడిపిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా రోగుల చేత ఇక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న మెడికల్షాపు నిర్వహకుల నుంచి కొంత మంది సిబ్బందికి రోజువారి చేతివాటం అందుతున్నట్టు తెలిసింది.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా..
- డా. రాథోడ్ సింగ్ , సూపరింటెండెంట్, ప్రభుత్వ వైద్యశాల నల్లగొండ.
వాస్తవంగా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రయివేటు మెడికల్ షాపు ఏర్పాటు చేయకూడదు. కానీ ఇక్కడ దుకాణానికి కలెక్టర్ అనుమతి ఉందని షాపు నిర్వహకులు చెబుతున్నారు. అయినప్పటికీ వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా. కలెక్టర్ ఆదేశాల మేరకు నడుచుకుంటాం.