Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విక్రయించిన భూములు తిరిగి కోర్టు ద్వారా స్వాధీనం
- నవతెలంగాణతో డీసీఎంఎస్ చైర్మెన్ వట్టె జానయ్య యాదవ్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రైతులకు పంటల సాగు సీజన్లో అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువస్తూ వారు పండించిన ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేసి వారంతా ఆర్థికంగా బలోపేతం చేయడం సహకార సంఘాల ప్రధాన ఉద్దేశం. కానీ నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం(డీసీఎంఎస్) పేరు వింటనే అటువైపు చూసేందుకు కూడా ఇష్టపడని రైతులు, సంఘాల నాయకులు... ఇతర ప్రజా ప్రతినిధులు... ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ సంస్థ ప్రస్తుతం అప్పులపాలై కనీసం ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారిపోయింది. ఆ సంఘాలకు ఉన్న ఆస్తులను కూడా తాకట్టుపెట్టిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.
అయితే నిన్నటి మాట... నేడు ఆ సంఘం పనితీరులో పూర్తిగా మార్పు వచ్చింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం సంఘాన్ని నష్టాల ఊబిలో నుంచి గట్టెక్కించడమే కాదూ... లాభాల బాటలోకి తీసుకువచ్చింది. దానికి కారణం ఆ సంఘం చైర్మెన్‌తో పాటుగా పాలకవర్గం, అందులో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది.
ఇదే విషయాలపై 'నవ తెలంగాణాతో డీసీఎంఎస్ చైర్మెన్ వట్టె జానయ్య యాదవ్' ముచ్చటించారు.
విత్తనాలు, ఎరువులు విక్రయాలు
వరి, కందులు, పెసళ్లు, వేరుశనగ, విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రాయితీపై జిలుగు, జనుము విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. వీటితోపాటుగా అన్ని రకాల ఎరువులు పూర్తిస్థాయిలో రైతులకు చేరవేస్తున్నాం. అవసరమైతే మేజర్ గ్రామాలకు పెద్దఎత్తున ఎరువులు కావాలంటే స్థానికంగానే నిల్వ చేసి రైతులకు అందిస్తున్నాం. మండలానికి వచ్చి ఎరువులు కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో సమయం వృథా అవుతుంది. అందుకే రైతన్నకు చేరువలో విత్తనాలు, ఎరువులు పెడుతున్నాం.
లాభాల్లోకి వచ్చాం...
నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్) జిల్లా నూతన కార్యవర్గం 2020 ఫిబ్రవరిలో ఏర్పాటైంది. బాధ్యతలు చేపట్టే నాటికే అప్పుల్లోనే సంఘం ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ లెక్కల ప్రకారం రూ.2.53లక్షల నష్టాలలో ఉంది. అంతేగాకుండా దశాబ్ద కాలంగా సంఘం పూర్తిగా నష్టాలలోకి దిగజారిపోయింది.. ఆ నష్టాలను పూడ్చేందుకు తగిన మార్గాలను వెతికి వాటిని అమలు చేస్తున్నాం. అందులో మొదట ఉమ్మడి జిల్లాలో తమ సంఘం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ సీజన్లో దాదాపు 3.40లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం. ప్రస్తుతం నికరంగా రూ.24.57లక్షలు లాభాలలో ఉన్నాం.గతేడాది ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే రూ.11.88లక్షల కమీషన్ వచ్చింది. ధాన్యం కొనుగోలు చేస్తే రూ.16లక్షలు కమీషన్ రాగా, మరో రూ.30లక్షలు రావాల్సి ఉంది.
ఆదాయం కోసం కమీషన్ ఏజెన్సీ వ్యవస్థ ఏర్పాటు...
మా బ్రాంచ్ పేరుతో కేంద్రం ఏర్పాటు చేస్తే సంబంధత నిర్వాహకులు లాభంలో 25శాతం మా సంఘానికి చెల్లించాలి. దానివల్ల మాకు అదనపు ఆదాయం వస్తుంది. కేవలం మా పేరుతో వ్యాపారం చేస్తున్నందుకే చెల్లిస్తారు అంతే... ఆదాయం వచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాలలో కమీషన్ ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. మరి కొన్ని మండలాల్లో ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చండూరు, నేరెడుగొమ్ము, మునుగోడు, రామన్నపేట మండలాల్లో బ్రాంచ్‌లు నడుస్తున్నాయి. మరో 9బ్రాంచ్‌లు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి.. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు...
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న సంఘం ఉన్న ప్రాంగణంలో విశాలమైన స్థలం ఉంది. దానిని వ్యాపారం చేసేందుకు వీలుగా సీరియస్‌గానే బ్యాంకు రుణం ద్వారా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అద్దెకివ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. సుమారు నాలుగు ఫ్లోర్లు నిర్మిస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకటి, రెండు బ్యాంకులను కూడా సంప్రదించాం. త్వరలో ఆ పనులు మొదలు పెడతాం. దేవరకొండ, హుజూర్నగర్, రామన్నపేట కేంద్రాలలో సంఘానికి సంబంధించిన గోడౌన్లు కిరాయికి ఇవ్వడం వల్ల ఏడాదికి సుమారు రూ.4లక్షలు ఆదాయం వస్తుంది.
విక్రయించిన భూములను స్వాధీనం చేసుకున్నం....
గత పాలకవర్గం డీసీఎంఎస్‌కు సంబంధించి భువనగిరిలో ఉన్న భూములు ప్రయివేటు వ్యక్తులకు విక్రయించింది. నాటి పాలకవర్గం తీర్మానం లేకుండానే చైర్మెన్ భూమిని అమ్మి డబ్బులు సభ్యులందరికి డబ్బులు పంపిణీ చేశారని తెలిసింది. అయితే సుమారు కోటి రూపాయాలు అమ్మకం ద్వారా లభించాయి. కానీ ఆ సొమ్మును పూర్తిగా దుర్వినియోగం చేశారు. నూతన పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత కోర్టు ద్వారా పిటిషన్ వేసి ఆ భూములను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేగాకుండా సంఘం నుంచి మరో కోటి రూపాయాలు స్వాహా చేశారు. సభ్యులపై పోలీసు కేసు నమోదు చేసి ఆ సొమ్మును కూడా తిరిగి రాబట్టడం జరిగింది. మిర్యాలగూడ కేంద్రంలో డీసీఎంఎస్‌కు సంబంధించిన భూములు ప్రయివేటు వ్యక్తులు అక్రమించుకున్నారు. స్వయంగా అక్కడికి వెళ్లి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ స్థలాన్ని వశపరుచుకున్నాం. ఈ భూమికూడా మరో కోటి రూపాయల విలువ కలిగి ఉంటుంది.