Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమైన యాంటీబయాటిక్స్, రెమిడిసీవర్ మందులు ఎంఆర్పీ ధరలకే అందించగలిగినం
- భువనగిరి, బీబీనగర్‌లో అందుబాటులో జనరిక్ మెడిసిన్
- యాదాద్రి భువనగిరి జిల్లా ఔషధ తనిఖీ అధికారి సంపత్ కుమార్
నవతెలంగాణ - భువనగిరిరూరల్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు నిత్యం విటమిన్ మందులను అధికంగా వాడుతున్నారని, ఇది సరికాదని జిల్లా ఔషధ నియంత్రణ తనిఖీ అధికారి సంపత్ కుమార్ సూచించారు. శనివారం ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడి కరోనా నేపథ్యంలో మందుల వాడకం గురించి వివరించారు.
'ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో ప్రజలు అధికంగా మల్టీ విటమిన్ కొనుగోలు చేసి వాడుతున్నారన్నారు. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ డి 3, బి కాంప్లెక్స్, కాల్షియం, జింకుతో కూడిన మల్టీ విటమిన్ సి తో పాటు వివిధ రకాల ఇమ్యూనిటీ బూస్టర్, మినరల్స్ మందుల వాటి వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. మనం సహజంగా తీసుకునే కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయని, చక్కటి జీవన విధానం, నడక, వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అన్ని రకాల విటమిన్స్లూ అందుతాయని తెలిపారు. డాక్టర్ సలహా మేరకు కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మందులు వాడితే శరీరంపై మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అంతే కాకుండా ఇతర దుష్పలితాలూ ఏర్పడే అవకాశం ఉందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 380 రిటైల్ మెడికల్ షాపులు, 20 హోల్‌సేల్ మెడికల్ షాపులు ఉన్నాయని అన్నారు. కోవిడ్ మందుల సరఫరాలో ఎలాంటి లోపాలూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఇతర ముఖ్యమైన ఆంటీబయోటిక్, రెమిడిసీవర్ మందులను ఎంఆర్పీ ధరలకే అందించినట్టు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోవిడ్ ముంపు ఇంకా తొలగలేదని, మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్నారు. కోవిడ్ టీకాలను సాధ్యమైనంత త్వరగా ఆలస్యం వహించకుండా అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్లి చేయించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు ఔషధ వ్యయం తగ్గించడానికి ముఖ్యంగా దీర్ఘకాల రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు జనరిక్ ఔషధాల దుకాణాల్లో జిలా ్లకేంద్ర ఆస్పత్రిలో, బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. జనరిక్ మందులు నాణ్యతలో గాని ప్రభావంలో గాని బ్రాండెడ్ మందులతో పోలిస్తే ఎలాంటి వ్యత్యాసమూ ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని నిరభ్యరంతరంగా వినియోగించవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఔషధ నాణ్యతపై గానీ ఇతర సేవలపై గాని ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులు ఉన్నా జిల్లా ఔషధ తనిఖీ అధికారి కార్యాలయనికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చన్నారు.