Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.డేవిడ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 70 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యత్నించడం దుర్మార్గమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించదన్నారు. అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్‌ను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని కోరారు. అనంతరం ఏవో శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా నాయకులు మాధవరెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ్ల ధనుంజయనాయుడు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరుట్ల శంకర్ రెడ్డి, నాయకులు కునుకుంట్ల సైదులు, కారంగుల వెంకన్న, దొంత మల్ల రామన్న, షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.