Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డులు మార్చకపోవడంలో తప్పెవరిది..?
- అధికారుల తప్పులకు చర్యలుండవా...
- లంచాలకు అలవాటుకు ప్రభుత్వ భూమికి పట్టాలు..?
- రెవెన్యూ పట్టా పాసుపుస్తకాలతోనే పంటరుణం, రైతుబంధు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని తన స్వాధీనంలోకి తీసుకోకపోవడం, రైతులే ఆ భూములను సాగు చేసుకోవడం ఎవరు కూడా అడ్డుచెప్పకపోవడం వల్ల సాఫీగా సాగుతూ వచ్చింది. కానీ ఏనాడు భూమి తమదని ప్రభుత్వ అధికారులు అటువైపు చూడకుండా ఉండడం, రెవెన్యూ అధికారుల నుంచి అందిన పట్టా పాసుపుస్తకాలు ... రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు నేటికి వారికి చేరుతుండడంతో భూమిపై ఆశలు పెరిగాయి... అందుకే తమదే భూమి అనే ధీమాలో రైతులు ఉండడం సహజమే కదా...
ఎస్ఎల్బీసీ కోసం 43.35ఎకరాల భూమి
కనగల్ మండలంలోని జి.యడవల్లి గ్రామంలో సర్వే నెంబర్లు 351,352,354,356 లలో ఉన్న 43ఎకరాల 35గుంటల భూమి ప్రభుత్వానికి చెందింది. ఈ భూమిని 1999లో ఆనాటి ప్రభుత్వం అప్పటి ధరలకనుగుణంగా రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఎస్ఎల్బీసీ కాల్వ నిర్మాణం కోసం, మట్టిని తీసుకెళ్లడానికి ఈ భూములను కొనుగోలు చేసినట్టు అధికారులు చెపుతున్నారు. కొనుగోలు చేసిన రోజునే రికార్డులు మార్చడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ రైతులే ఈ భూమిని సాగు చేసు కుంటున్నారు. పట్టాపాసు పుస్తకాలు వారి పేర్లతోనే ఉన్నాయి. అంటే సుమారు 21 ఏండ్లుగా రైతులు ఆ భూములను సాగు చేస్తున్నారు.
రవెన్యూ అధికారులు నిర్లక్ష్యం...
ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత భూములకు అదే రైతుల పేరుతో పట్టాలిచ్చింది కూడా రెవెన్యూ అధికారులే కదా... రికార్డులు పరిశీలించి పట్టాలివ్వాలి... కానీ ఈ భూముల విషయంలో ఏ రికార్డులు చూడకుండా అధికారులు ఎలా పాసు పుస్తకాలు ఇచ్చారో అర్థం కావడంలేదు.. అంటే చేతులు తడిపుకుని పట్టాలిచ్చినట్టు అనుమానం వస్తుంది. అదీ అలా ఉంటే గత నాలుగేండ్ల నుంచి పట్టాపాసుపుస్తకాలు కలిగిన రైతులకు మాత్రమే అందజేసే రైతుబంధు పథకం అమలు జరిగేపుడైనా ఆ భూమి ఎవరిదనే విచారణ జరగాలే కదా.. అవేవి జరగకుండా పంటరుణాలిస్తిరి... రైతుబంధు ఇస్తిరి...ఇపుడు ప్రభుత్వ భూములను అక్రమించి సాగు చేసుకుంటున్నారని రైతులను కేసులపాలు చేశారు.. ఇదెక్కడి న్యాయమో అర్థం కావడంలేదు.రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకోవడానికి, పంటరుణాలు, రైతుబంధు తీసుకోవడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. ఇపుడు ఆ రైతులు పోలీస్స్టేషన్లలో కేసులలో ఇరుక్కుపోవడం కారణం కూడ వారి నిర్లక్షం పలితమే.. కనీసం రైతుబంధు ఇచ్చేనాడైనా అభ్యంతరం చెప్పి ఉంటే అపుడే సమస్య పరిష్కారం అయ్యేది.. సుమారు రూ.30లక్షలకు పైగా రైతుబంధు, రూ.50లక్షలకు పైగా పంటరుణాలు ప్రభుత్వంపై అధనపు భారం పడేదికాదు... అందుకే ఈ ఉదంతంలో ప్రధాన పాత్ర దారులుగా రెవెన్యూ అధికారులను కూడా చేర్చి తపుడు సర్టిఫికెట్లు ఇచ్చినందుకు వారిపై కూడా కేసు నమోదు చేయాలని, కోర్టు ఆదేశాల మేరకు అందరు నడుచుకునే చర్యలు తీసుకుని, రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగం లక్ష్మినారాయణ ప్రభుత్వాన్ని కోరారు.