Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందర్శకులతో కిక్కిరిసిన క్యూలైన్
- కొండకింద వాహనాలతో మెయిన్ రోడ్డు జాం
- సాయంత్రం కురిసిన వర్షంలో తడిసిన యాత్రికులు
- లాక్డౌన్ సడలింపుతో భారీన భక్తుల రాక
- నిత్యాదాయం రూ. 20.49లక్షలు
నవతెలంగాణ-యాదాద్రి
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సండలించిన తర్వాత మొదటి ఆదివారం సుప్రసిద్ద క్షేత్రం యాదగిరిగుట్ట స్వామి దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తజనంతో పోటెత్తింది. దైవ దర్శనానికి సుమారు 2గంటలకు సమయం పట్టింది. కొండపైన అలాగే కొండకింద మెయిన్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అద్దె గదులు, పార్కింగ్ సౌకర్యం లేక నానా అగచాట్లు పడ్డారు. యాదగిరిగుట్ట బస్టాండ్ నుండి వైకుంఠ ద్వారం వరకు రోడ్డుకు ఇరువైపుల డెవలప్మెంట్ పనులు సాగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కొండపైన డెవలప్మెంట్ పనులు సాగుతున్న తరుణంలో తీవ్ర స్థలాభావం ఉండటం చేత సాయంత్రం కురిసిన వర్షానికి భక్తజనం అవస్థలు ఎదుర్కొన్నారు. వర్షంలో తడిసి ముద్ద అయ్యారు. కొండకింద కూడా తలదాచుకోవడానికి నిలువ నీడ లేకపోవడంతో ఆరుబయట వంటలు చేసుకొనే భక్తుల బాదలు వర్ణాతీతం. వీరి వంటలకు పూర్తిగా షెడ్లు లేవు వీటికి తోడు బాత్రూంలు లేకపోవడం చేత మహిళలు, వృద్దులు నరకయాతన అనుభవించారు. భక్తుల కానుకలకు పెద్ద హుండీలు అందుబాటులోకి తెచ్చే టెంపుల్ ఆఫీసర్లు ఆ మేరకు సౌకర్యాల సంగతి పట్టించికోకపోవడం శోచనీయం. ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతోంది..? ఏమి చేయలేం..? అని చేతులు దులుపుకుంటున్నారు ఇక్కడి ఆఫీసర్లు. టెంపుల్ నుండి ఏటేటా కాంట్రీబ్యూషన్ ఫండ్‌ను పొందే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కూడా తాత్కాలికంగా సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతోంది. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే రన్నింగ్ పబ్లిక్ ఈ అసౌకర్యాలతో నానా ఇబ్బందులు పడుతుంటారు. మరుదుదొడ్ల బాధలను తీర్చక టెంపుల్, యాదగిరిగుట్ట మున్సిపల్ శాఖలు గాలికోదిలేశాయి. అసలు భక్తుల పక్షాన నిలదీసే నాథుడే ఇక్కడ కరువయ్యాడు.
పూజల్లో భక్తులు..
అర్జిత సేవోత్సవాల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని పూజలు చేసి స్వామిఅమ్మవారలను దర్శించి తరించారు. బాలాలయంలో నిత్య కల్యాణం, అర్చనలు, అష్టోత్తరపూజలు, సువర్ణ పుష్పార్చనలు, తులసీ కాటేజీలో సత్యదేవుని వ్రతాలు అధిక సంఖ్యలో జరిపించారు. కాగా కొండపైన వెలసిన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామివారి కూడా కొలిచి అర్జిత సేవల్లో తరించారు.
రద్దీ...
అధిక సంఖ్యలో భక్తులు వాహనాలపై రావడం మూలంగా ఘాట్ రోడ్డు కొండపైకి వాహనాలకు అనుమతించలేదు. ఐతే కొండకింద తులసీ కాటేజీ వద్ద మెయిన్ రోడ్డుపైనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. లోకల్ మార్కెట్ వచ్చిన జనంతో పట్టణంలో కూడా దారులన్ని కిటకిటలాడాయి. ఉదయం నుంచే తులసీ కాటేజీల ప్రాంగణం భక్త వాహనాలు, యాత్రికులతో నిండిపోయింది. సాయంత్రం సుమారు గంటపాటు కురిసిన వర్షానికి తలదాచుకొను స్థలం లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఆదివారం వివిధ శాఖల ద్వారా భక్తల నుంచి సమకూరిన వచ్చిన ఆదాయం రూ. 20,49,662ల ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.