Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి బురదతో మరకలు
- పోలీసు ప్రతిష్టకు భంగం
-యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రావు డాక్యుమెంట్ ఫోర్జరీ సంతకం చేశారు. అయితే ఆ తర్వాత అడ్డగూడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో కేసు విచారణ జరగగా సస్పెండ్ అయ్యారు.
- రేషన్ బియ్యం అక్రమ రవాణ కేసులో రూ.40వేలు లంచం తీసుకుంటూ గుండాల ఎస్ఐ బి. చందర్ నాయక్ ఏసీబీ వలలో చిక్కాడు.
-యాదాద్రి జిల్లా అడ్డగూడుర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసిందనే పేరుతో మరియమ్మ అనే మహిళను చితకబాదడంతో లాకప్ డెత్ సంఘటన జరిగింది. ఆమె పిల్లలను కూడా థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చితకబాదారు. దీనికి కారణమైన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. సంఘటనకు ఏసీపీని కూడా బాధ్యుడిని చేస్తూ కమిషనరేట్‌కు ఆటాచ్ చేశారు. ఈ కేసు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని కేసు విచారణ చేస్తోంది.
-జిల్లా మంత్రి సొంత మండలమైన నాగారం ఎస్ఐ లింగం భూ వివాదంలో జోక్యం చేసుకొని బాధితులపై చేయిచేసుకున్నాడు. అక్కడి నుంచి బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అతన్ని జిల్లా కార్యాలయానికి ఆటాచ్ చేశారు.
-మోత్కూర్ ఎస్ఐ హరిప్రసాద్ ఆరు నెలల క్రితం ఓ భూవివాదంలో జోక్యం చేసుకుని బాధితులను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణతో కమిషనరేట్ కార్యాలయానికి ఆటాచ్ చేశారు.
- మండలంలో ప్రయివేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పలు భూ సమస్యల్లో తలదూర్చి సామాన్యులను బెదిరిస్తూ, ముడుపులు తీసుకుంటున్న మర్రిగూడ ఎస్ఐ క్రాంతి కుమార్‌ను ఈ మధ్యనే వీఆర్‌కు ఆటాచ్ చేశారు.
- రామన్నపేట సీిఐ, ఎస్ఐ అవినీతికి పాల్పడుతూ, కేసుల నమోదు పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదుతో ఇద్దరు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్‌చేశారు.
- ఇసుక అక్రమ రవాణా, అవినీతి ఆరోపణలపై తిరుమలగిరి ఎస్ఐ డానియేల్కుమార్ను సూర్యాపేట ఎస్పీ ఆఫీస్‌కు పంపించారు. అతనితో పాటు ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిది
కనిపించని నాలుగో సింహం పిలవబడే పోలీసు కాసుల కోసం వేటా మొదలు పెట్టారా అంటే నిజమేననిపిస్తోంది. ఆ ఆరాటం తమ చేతల్లో స్పషంగా చూపిస్తున్నారు. ప్రతి పనికీ తమ వద్ద ఓ రేటు ఉంటుందని అవినీతి బాట పడుతున్నారు. చాలా ఏండ్లుగా రహస్యంగా జరుగుతున్న ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చి పోలీసులు అబాసుపాలవుతున్నారు. 'బంజర దొడ్డికి వెళ్లిన పశువు పెండ పెట్టక మానదూ... పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి ఫీజు చెల్లించక తప్పదు ' అనే సామెతను నిజం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసులు. పైసలు లేనిదే ఏ పని చేయరు మన ఫ్రెండ్లీ పోలీసులు.. అనే తీరును ఖాకీలు నిజం చేస్తున్నారు. ప్రజా రక్షణలో ఎంతో గొప్పగా నిలుస్తున్నామనే తీరుతో తమ చేష్టలతో పోలీసు శాఖకు తమ అవినీతి మరకల్ని కూడా అంటిస్తున్నారు. ప్రతి సారి ఏదో ఒక వివాదంలో పోలీసు అధికారులు ఇరుక్కుపోతున్నారు. అవినీతితో ప్రజలలో అప్రతిష్టకు గురవుతున్నారు. గత కొన్నేళ్లుగా పోలీసుల వ్యవహర శైలితో ప్రజలలో చర్చనీయాంశంగా మారుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ పనుల మీద పోలీస్ స్టేషన్లకు వెళ్లే వారికి పోలీసు అధికారులు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ బాధలను తీర్చాలని కోరుతూ ఠాణాలకు వెళ్లిన వారికి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే పోలీసు స్టేషన్లో పంచాయితీ పరిష్కారం అయితే ఇంత సొమ్ము చెల్లించాలనే నిబంధనలు కూడా అమలు చేస్తున్నట్లు సమాచారం. మద్యవర్తులతో ప్రమేయంతో ఠాణా లోపల, బయట పంచాయితీలు చేస్తున్న సంఘటనలు కూడ అనేకం ఉన్నాయి. ఇక సివిల్ కేసుల జోలికి వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నా... చాలా చోట్ల ఇవే పోలీసు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్నాయి. సమస్య చెపుకోవడానికి వచ్చే బాధితులతో కూడా అమర్యాదగా ప్రవరించడం, అనుమానితుల్ని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టిన సంఘటనలో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ జరిగాయి. ఇక ఏ పోలీస్ స్టేషన్ చూసిన చోటా మోటా రాజకీయ నాయకులకు వత్తాసు పలకడం సర్వసాధారణమైంది. పలు కేసుల విషయంలో వారికి అండగా ఉంటూ ఇతరులను ఇబ్బందులు పెడుతున్నట్లు విమర్శలు కూడా పెద్దఎత్తున వస్తున్నాయి. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సంస్కరణలు తీసుకువస్తూ... కేసుల విషయంలో సాంకేతికతను జోడిస్తున్న తరుణంలో ఇలాంటి అవినీతి అక్రమాలకు దూరమవ్వాలని ప్రజలు కోరుతున్నారు. శాంతిభద్రతల కాపాడడంలో భాగస్వామ్యమవుతూ పోలీసుల పంథా న్యాయంవైపు నిలబడేలా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.