Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మశానవాటికల నిర్మాణాల్లో అలసత్వం వద్దు
- మున్సిపాలిటీ భూముల పరిరక్షణకు చర్యలు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు. జులై 1 నుండి 10వ తేదీ వరకూ నిర్వహించనున్న పట్టణ ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్ నుంచి సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ చైర్మెన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతిపై సత్ఫాలితాలు సాధించేందుకు సీఎం ఇచ్చిన సూచనలు పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. స్మశాన వాటికల నిర్మాణాల్లో ఎలాంటి అలసత్వమూ చూపొద్దన్నారు. మున్సిపాలిటీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. భూముల రికార్డుల నిర్వహణనూ పకడ్బందీగా చేపట్టాలని కోరారు. పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటులో మున్సిపాలిటీలు ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు, మున్సిపల్ చైర్ పర్సన్లు, జిల్లా కలెక్టర్లు టి.వినరు కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్ పాటిల్, పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్‌రావు, పాటిల్ హేమంత్ కేశవ్, దీపక్ తివారీ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.