Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వానిది తప్పులేదు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కృష్ణా బేసిన్లో జల వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాయడంపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జల వివాదాన్ని సృష్టించిందే ఏపీ సర్కార్ అని, ఈ వివాదంపై జగన్ ప్రభుత్వం చేస్తున్నవి చిలక పలుకులని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నీటి అవసరాలు ఏపీ ప్రభుత్వానికి పట్టావా అని ప్రశ్నించారు. కోర్టుకిచ్చిన మాట తప్పింది ఎవరని, సర్వేల పేరిట నిర్మాణాలను కొనసాగిస్తోంది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు. జీవోల పేరిట ఏపీ ప్రభుత్వం చిలుక పలుకులు మాట్లాడుతున్నారని, తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవోనైనా ఇచ్చారా అని అన్నారు. మద్రాసుకు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృష్ణా నీళ్లను దోచుకెళ్లారని, సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న తెలంగాణ రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహం చేశారని విమర్శించారు. ఏడేండ్ల కరువులోనూ కృష్ణా డెల్టాకు నీళ్లు వదిలారని, ఎడమ కాల్వ ఎత్తు మీద, కుడి కాల్వ కింది భాగంలో ఉందన్నారు. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారని గుర్తు చేశారు. తెలంగాణను ఆడుకుంటాం.. వాడుకుంటాం.. అంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమన్నారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, ఇరు రాష్ట్రాలకు పనికొచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఫార్ములాను పక్కనపెట్టి అహంకారంతో పోతున్నారని, ఇందులో తెలంగాణాది ఈసమెత్తు తప్పు కూడా లేదన్నారు.