Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా కాలంలో ప్రజలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికధరలపేరుతో భారాలు మోపడం సిగ్గుచేటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.కరోనా మూలంగా దేశంలో పెద్దఎత్తున మరణాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.సెకండ్ వేవ్‌లో కోవిడ్ మహమ్మారి కలిగిస్తున్న కష్టాలకు తోడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను తీవ్రంగా కడగండ్ల వశం చేశాయన్నారు.ఆదాయాలు పడిపోయి, ఆకలితో, నిరుద్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటికి మించి ద్రవ్యోల్బణం పెరిగి నిత్యవసరాల ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. ఉచిత ఆహారకేంద్రాల ముందు పెరుగుతున్న లైన్లు చూస్తుంటే ఆకలి బాధలు ఎక్కువై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ముడిచమురు ధరల పెంపుభారాన్ని ప్రజలపై మోపిందన్నారు.మే,జూన్ నెలల్లో కలిపి పెట్రోల్ ధరలు 36 సార్లు పెరిగాయన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. రవాణా ఖర్చులు పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అంతిమంగా నిత్యవసర ధరలపై ప్రభావం పడుతోందన్నారు. పంపుసెట్లకు,ట్రాక్టర్లకు డీజిల్ ఉపయోగించే రైతులైతే ఈ పెరిగిన వ్యయంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.సబ్సిడీలో గణనీయంగా కోతవిధించడంతో వంటగ్యాస్ ధరలు పెరిగాయన్నారు.ధరల నియంత్రణ చర్యలు అమలుచేయడంలో మోడీప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్పొరేట్లను,ధనవంతులను బుజ్జగించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు.అందరికీ 10 కిలోలు చొప్పున ఉచిత ఆహారధాన్యాలు,నెలకు రూ.7500 చొప్పున ఆరుమాసాల పాటు పేద వర్గాలకు చెందిన అన్ని కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ చేయాలన్నారు.అందరికీ ఉచితంగా వేగంగా వ్యాక్సినేషన్, ఉచిత ఆహార కిట్ల సరఫరా, ఉపాధిహామీ చట్టం విస్తరణ, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర పన్నుల్లో కోతలతో సహా ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు,ధీరావత్ రవినాయక్ పాల్గొన్నారు.