Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
- అధికారులకు మెమోలు జారీ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
విధి నిర్వహణలో అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇటీవల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి జిల్లా, మండల స్థాయి యంత్రాంగంతో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు గుండాల, రాజపేట, బొమ్మలరామారం తహసీల్దార్లు హాజరు కాకపోవడం పట్ల సోమవారం కలెక్టర్ వారికి చార్జి మెమోలు జారీ చేశారు. ఎందుకు హాజరు కాలేదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, ట్రాన్సోకో డీఈఈ ఆపరేషన్స్, డిఎస్ మల్లికార్జున్ కు మెమోలు జారీ చేశారు. రాయగిరి వద్ద హరిత హారంలో నాటిన మొక్కలను కొట్టేసిన సందర్భంగా అధికారులు సంజాయిషీ ఇవ్వాలని, వారికి మెమో జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ అంకితభావంతో పని చేస్తూ ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యతనిచ్చి అమలు చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఎంతమాత్రం పనికిరాదన్నారు. కలెక్టర్ ఆదేశించిన, మెమోలు జారీ చేసిన అధికారులు వెంటనే తగు సంజాయిషీ సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.