Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కులాలు వారిగా విభజన చేసి వేతనాలను ఇవ్వాలనే ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని నర్ర రాఘవ రెడ్డి భవనంలో ఉపాధి కూలీల పెండింగ్ వేతన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా పని కల్పించాలన్న చట్టం స్పూర్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం విఘాతం కలిగిస్తోందన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు ఉప ప్రణాళిక కేటాయింపులు ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పడం మోసమే నన్నారు. కరోనా వల్ల పట్టణ ప్రాంతాల నుండి గ్రామాలకు వెళుతున్న వారందరికీ పని కల్పించాలన్నారు. వారికి రోజుకు రూ 600 కూలి, పనిదినాలను 200 రోజులకు పెంచాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన వెంకులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఐఎంఎల్్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయి కృష్ణ, బహుజన కమ్యూనిస్టు రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బోళ్ల నర్సింహ రెడ్డి, చింతపల్లి లూర్దు మారయ్య, రైతు సంఘం నాయకులు కోట లింగయ్య, సీఐటీయూ నాయకులు వంటెపాక వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పుట్ట సత్తయ్య, కేవీపీఎస్్ నాయకులు వంటెపాక కృష్ణ, రైతు కూలీ సంఘం నాయకులు పుట్ట సత్తయ్య, ప్రజా నాట్యమండలి నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.