Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్ర సమర యోధుడి భూమి మాయం
- తప్పుడు పత్రాలతో మరో వ్యక్తి పాగా
- న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న వైనం
నవతెలంగాణ - సూర్యాపేట
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల స్వతంత్య్ర సమరయోధునికి సంబంధించిన భూమి కబ్జాకు గురైంది. తప్పుడు పత్రాలు సృష్టించిన ఓ వ్యక్తి ఆయన భూమిపై పాగా వేశాడు. దీనికి రెవెన్యూ అధికారుల తోడు ఉండడంతో కావాల్సిన అన్ని పత్రాలూ తీసుకున్నాడు. ఈ విషయంపై బాధితుడు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల్లో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని కుడకుడ గ్రామానికి చెందిన పంతంగి శ్రీరాములు స్వాతంత్య్ర సమర యోధుడు. ఆయన 1994లో పిల్లలమర్రి గ్రామ శివారులో సర్వే నెంబర్ 816/రూ లో అనంతుల దామోదర్ వద్ద నుంచి మూడెకరాలా 26 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాస్ బుక్ కూడా ఉంది. శ్రీరాములు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తన భూమిలో నుంచి రెండెకరాలా 33 గుంటల భూమిని నారబోయిన లక్ష్మి అనే రైతుకు విక్రయించారు. దీంతో శ్రీరాములుకు 0.33 గుంటల భూమి మిగిలింది. దీనిపై 2018 ఏప్రిల్‌లో డిజిటల్ పట్టాదారు పాస్ బుక్ కూడా ఆయన తీసుకున్నారు. కుమారుల ఆస్తి పంపకాల సందర్భంగా ఐదో కుమారుడికి 0.33 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రిజిష్ట్రేషన్ చేయించారు. దీనికి సంబంధించి ఆయన కుమారుని పేరుతో 2018 అక్టోబర్‌లో టి 29210122657 నెంబర్ గల డిజిటల్ పాస్‌బుక్‌ను రెవెన్యూ అధికారులు జారీ చేశారు.
భూమి విక్రయించకున్నా వేరే వ్యక్తి పేరున నమోదు...
శ్రీరాములు తన కుమారుడికి ఇచ్చిన 33 గుంటల భూమి రాయినిగూడెంకు చెందిన సందనబోయిన వెంకన్న పేరుతో నమోదై ఉంది. విషయం తెలుసుకున్న శ్రీరాములు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ భూమి 2017లో పొందినట్టు రికార్డుల్లో తేలింది. అదే సర్వే నెంబర్ 816/రూ లో ఆయన విక్రయించినట్టుగా ప్రొసీడింగ్ ఈ నెంబర్ ఎస్.బి./ఎన్.జి/ఎస్.పి./ఎస్.పి./2016/66060న ఉంది. అవాక్కైన శ్రీరాములు సెప్టెంబర్ 2019న సూర్యాపేట తహశీల్దార్ కార్యాలయంలో తన భూమి వివరాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఇచ్చిన కాగితాల్లో ఆయనకు 1.10 గుంటల భూమి ఉన్నట్టు ఉంది. తనకున్నది కేవలం 33 గుంటలే అంటూ అధికారులను నిలదీశారు. అంతే కాకుండా తాను ఆ భూమిని 1987లోనే విక్రయించినట్టుగా తప్పుడు పత్రాలు ఎలా సృష్టించుకున్నారని అధికారులను ప్రశ్నించారు. సందబోయిన వెంకన్న సృష్టించిన తప్పుడు పత్రాలపై సూర్యాపేట తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు స్పందించి రాయినిగూడెం గ్రామంలో విచారణ చేపట్టారు. అనంతరం సందనబోయిన వెంకన్నకు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన రికార్డులు సూర్యాపేట తహశీల్దార్ కార్యాలయంలో లేవని సమాచార హక్కు చట్టం కింద శ్రీరాములు చేసుకున్న దరఖాస్తుకి 2019 సెప్టెంబర్‌లో అప్పటి తహశీల్దార్ ప్రొసీడింగ్ ఇచ్చారు.
పట్టాదారునికి ముందస్తు లీగల్ నోటీసు ఎందుకివ్వలేదు...?
సాదా బైనామా చట్టం ప్రకారం ఫారం 10, 11కు లోబడి ఇతరుల పేరున ఉన్న భూమి వేరే వ్యక్తుల పేరున ప్రొసీడింగ్స్ ఇచ్చే ముందు పట్టాదారునికి ముందస్తు లీగల్ నోటీసు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఓ స్వాతంత్య్ర సమర యోధుని భూమి రికార్డుల్లో మాయమైంది.
సివిల్ కోర్టును ఆశ్రయించిన శ్రీరాములు
రెవెన్యూ అధికారులు అక్రమంగా వెంకన్న పేరున జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ బాధితుడు శ్రీరాములు సూర్యాపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీషన్ వేశారు. జూన్ 2019న ఇంజక్షన్ ఆర్డర్ (ఐ.ఎ.నెంబర్ 286/2019 ఇన్ ఒ.ఎస్.నెంబర్ 114/2019) అందించారు.
చెప్పులరిగేలా తిరుగుతున్నా ..పట్టించుకోని వైనం
రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసిన సందబోయిన వెంకన్నకు అప్పటి సూర్యాపేట తహసీల్దార్ అందించిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని సూర్యాపేట కలెక్టరేట్లో 2021 మార్చిన (కేసు నెంబర్ ఎఫ్ 2/2770/2019) దరఖాస్తు చేశారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. తనకు న్యాయం చేయాలని శ్రీరాములు ఎన్ని సార్లు కలెక్టరేట్‌కు తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.