Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ -నల్లగొండ
కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు ,మహిళలు కనీసం పౌష్టికాహారం తినలేని పరిస్థితుల్లో ఉన్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షురాలు కందాల ప్రమీల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్ని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన నియంత్రణ ఎత్తివేసి అధిక ధరలు పెంచిందని విమర్శించారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని నడ్డి విరిచిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలని రైతాంగం ఉద్యమిస్తుంటే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయకుండా ఇతర దేశాలకు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. ఆరోగ్య సంస్థలు హెచ్చరించినప్పటికి ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఘోరంగా విఫలం చెందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కరోనాతో మరణించిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.దేశంలో నేటికీ మహిళలు, వద్ధులు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని కఠినమైన శిక్షలు విధించడం లేదని అన్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఆఫీస్ బేరర్స్ పోలెబోయిన వరలక్ష్మి ,కొండ అనురాధ తుమ్మల పద్మ , దైదా జానకమ్మ, నిమ్మల పద్మా ,తదితరులు పాల్గొన్నారు.