Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్‌ను తెలంగాణా సమాజం వదులుకోదు
- మంత్రి జగదీష్ రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
ఇటీవల కాలంలో కొన్ని రాజకీయాల పార్టీల్లో ఎదుగుదల లేని నేతలు (స్టంట్ మాస్టర్లు) ఏదోలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అలాంటి ఎదుగుదల లేని నాయకులు కేవలం కెమెరాలకే పరిమితం అవుతారని మంత్రి ఎద్దేవా చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను వదులు కోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేరన్నారు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ముందు, వెనుక ఆలోచించుకోవాలని హితవుపలికారు. పైరవీలతో పదవులు రావొచ్చేమో గానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం, ఇష్టానుసారంగా బూతులు తిడతాం అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
ప్రపంచ పటంలో సూర్యాపేటకు స్థానం దక్కాలి
సద్దుల, పుల్లారెడ్డి చెరువులను సందర్శించిన మంత్రి
సూర్యాపేట జిల్లాకు ప్రపంచ పటంలో చోటు దక్కాలన్నదే లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని సద్దుల చెర్వు వద్ద నూతనంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్‌తో పాటు జమునానగర్‌లోని స్మశాన వాటికలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బర్నింగ్ యూనిట్, డంపింగ్ యార్డును పరిశీలించారు. 29వ వార్డులో మొక్కలు నాటారు. పుల్లారెడ్డి చెరువు వద్ద నిర్మిస్తున్న స్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం మంత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజల పాత్ర కీలకమన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కూడా అదేనని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని, అందుకు నిదర్శనం ఊరూరా వెలుస్తున్న ప్రకృతి వనాలేనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి, వైస్ చైర్మెన్ పుట్టా కిషోర్, సూర్యాపేట ఎంపీపీ, బీరవోలు రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనువాస్‌గౌడ్, రైతు సమన్వయ కమిటీ నాయకులు కక్కరేణి నాగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చెక్ డ్యాం నిర్మాణాలతో జలకళ
సూర్యాపేటరూరల్ : చెక్ డ్యాంల నిర్మాణాలతో నియోజకవర్గంలో జలకళ సంతరించుకోనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని రాయినిగూడెం సమీపంలోని మూసీ ఏరులో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంలను ఆయన పరిశీలించి మాట్లాడారు. దశాబ్దాలుగా వథాగా పోతున్న జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చెక్ డ్యాంల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. దీనికి అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ రూ.120 కోట్లు మంజూరు చేశారన్నారు. సుమారు 700 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంలో వ్యవసాయాన్ని సాగు చేసుకునేందుకు వీలుగా జిల్లాలో మొత్తం 16 చెక్ డ్యాంల నిర్మాణాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, నాయకులు కాటసాని వెంకట్‌రెడ్డి, ఉయ్యాల దశరథ, గోగిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.