Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని 12న నిరసనలు
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోయిందన్నారు. ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు విడుదల చేయక పోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరికాదన్నారు. లాక్డౌన్ వల్ల పేద, మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, రైతు, చిల్లర వర్తకులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వాలు చేసిన ఉపశమణ కార్యక్రమాలు, ఆర్థిక వెసులు బాటు ప్రజలను ఏ మాత్రమూ ఆదుకోలేక పోయాయని ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య, జిల్లా కార్యదర్శి మడ్డి కృష్ణమూర్తి, పచ్చిపాల వెంకన్న, యువజన నాయకులు కొమ్ము జోహర్, జిల్లా నాయకులు దొంగరి గోవర్ధన్, మండల నాయకులు రేగటి వెంకటేష్, మధు, అశోక్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.