Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎగుమతి, దిగుమతి పనులు నిర్వహిస్తున్నహమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మండల కేంద్రంలో హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ప్రమాద బీమా సౌకర్యం కనిపిస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంచి రోజులొస్తాయని, అవినీతి పోతుందని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరూ అకౌంట్లో రూ.1500 వేస్తామని ఇచ్చిన హామీలు గాలికొదిలేసి దేశ సంపదను కార్పొరేట్శక్తులకు దోచిపెట్టే విధానాలు అవలంభిస్తున్నారని, ఇదేనా అచ్చే దిన్ అని ప్రశ్నించారు. కరోనా వచ్చి ప్రజలు పిట్టల్లా రాలుతుంటే వారికి సరైన వైద్యం అందించకుండా వ్యాక్సినేషన్ వేయకుండా అసలు ప్రజలనే పట్టించుకోకుండా రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారని విమర్శించారు. కార్మికులను ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం మాదిరిగా నెలకు రూ.7500, ప్రతి మనిషికి పది కిలోల బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులివ్వాలని, అనేక రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కోరుతుంటే మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. అనంతరం మాడుగులపల్లి గ్రామ హమాలీ వర్కర్స్ యూనియన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవాధ్యక్షులుగా రొండి శ్రీనివాస్, అధ్యక్షులుగా మాడుగుల యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా పుల్లెంల రాజు, ఉపాధ్యక్షులు పుల్లేంల సైదులు, సహాయ కార్యదర్శి ఇండ్ల ఇన్నయ్య, కోశాధికారి తండు యాదయ్య, కార్యవర్గ సభ్యులుగా బాలయ్య, వెంకన్న, పందిరి సైదులు, తిరుపతయ్యలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రొండి శ్రీనివాస్, హమాలీ నాయకులు యాదయ్య, రాజు, సైదులు, కొండల్ పాల్గొన్నారు.