Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
కష్ణా నదిపై దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నీటిని వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కష్ణా నది బేసిన్లో నీళ్ల సమస్య పరిష్కరించాలని ఈనెల 26న చేపట్టే ధర్నా ను జయప్రదం చేయాలని కోరారు. ఈ ప్రాంత భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఫ్లోరైడు ఉండడం వల్ల లక్షలాది మంది ప్రజలు ఫ్లోరిన్ పీడితులుగా మారారన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగు నీరు అందించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం, ఎమ్మార్పీ వరద కాలువ, మూసి ప్రాజెక్టు సామర్థ్యం పెంపు, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ, లిఫ్టుల నిర్వహణ తదితర సమస్యలపై రైతాంగం, ప్రజా సంఘాలు, కలిసివచ్చే రాజకీయ పార్టీల తో ఐక్య ఉద్యమాలు నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న ,జిల్లా నాయకులు చాపల మారయ్య , మండల నాయకులు యసరాణి శ్రీను , వీరమల్లు , వేముల లింగస్వామి, పర్సనగోని యాదగిరి, మిర్యాల భరత్ పాల్గొన్నారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
చండూర్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని కొండాపురం, నెర్మట గ్రామ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ప్రజలు తీవ్ర నష్టం కలిగించాయని విమర్శించారు. పెట్రోల్ ,డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు , పేదలు మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు.కొండాపురం గ్రామంలో రోడ్డు బురదమయంగా మారిందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆ పార్టీ మండల కార్యదర్శి బొట్టు శివకుమార్ మాట్లాడుతూ మండలంలోని బంగారిగడ్డ నుంచి నారాయణపురం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలన్నారు. నాయకులు సీనియర్ గోలి బిక్షం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జేరిపోతుల ధనంజయ గౌడ్, గోలి బిక్షం ,కొత్తపెళ్లి నరసింహ, యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.