Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్ర పూజల పేరిట కలకలం సష్టించి భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు .సోమవారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని రంగారెడ్డి నగర్‌కు చెందిన కూడతల మురళి తొమ్మిది నెలల క్రితం అనుకోకుండా ఆధర్ నెంబరుకు ఫోన్ చేయగా పూజిత అనే అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుండి ఆ అమ్మాయికి మెసేజ్‌ల ద్వారా పరిచయంలో ఆమెపై ఇష్టం పెంచుకొని ప్రేమిస్తున్నాను అని చెప్పగ సదరు మహిళ ఒప్పుకోలేదు.కొద్ది రోజుల తర్వాత ఆ మహిళకు వివాహం జరిగింది.ఎలాగైనా ఆమెను దక్కించు కోవాలనే ఉద్దేశంతో మురళి యూట్యూబ్ వీడియోల ఆధారంగా చేతబడి వంటివి చేస్తే భయపడి పెండ్లి బంధం విడిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 18తేదీన గుండ్లపల్లి గ్రామంలో పోలోజు వెంకటాచారి ఇంటి ముందు కుంకుమ, పసుపు జీడిగింజలు వేసి ఆ తర్వాత పూజిత భర్తకు ఫోన్ చేసి తిట్టి బెదిరించాడు. ఆ తర్వాత ఈ నెల 6 నమళ్లీ రాత్రి 12గంటల సమయంలో మురళి తన బైకుపై గుండ్లపల్లికి వచ్చి ఇంటి ముందు గేటు దగ్గర ఎముకలు,కుంకుమ,జీడిగింజలు, గవ్వలు ,నిమ్మ కాయలు, వెంట్రుకలు,వక్కలు, పసుపు బియ్యం వస్తువులను పెట్టాడు. గ్రామంలో రెండుసార్లు చేతబడి పేరుతో భయభ్రాంతులకు గురైన ప్రజలు నిందితుడు దొరకడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపి త్వరగా నిందితున్ని పట్టుకుని రిమాండ్ చేసిన సిబ్బంది రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి,పీఎస్ఐ రాజశేఖరరెడ్డి,సిబ్బంది నాగరాజు సలీమ్ తదితరులను డీఎస్పీ అభినందించారు .