Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని చీకటిమామిడిలో మంగళవారం సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డి ట్రై సైకిళ్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం తరుపున సహాయం చేయాలని కోరడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి ముందుకొచ్చి బొమ్మల రామారం మండలానికి 37 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. బోదకాలతో బాధపడేవారికి కూడా రూ.3016 పింఛన్ విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సదరం క్యాంపునకు వెళ్లి బాధితులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. చీకటిమామిడి గ్రామాన్ని ఎంచుకొని పక్కనే ఉన్న తుర్కపల్లి మండలం మాదాపూర్, మల్కాపూర్ గ్రామాల్లోని వికలాంగులకు కూడా ఈ సెంటర్ లోనే ట్రై సైకిళ్లు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ మచ్చ వసంత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గొడుగు శోభ చంద్రమౌళి గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొలాగౌని వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.