Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ (ఈదుల్ జుహా) పండుగను జరుపుకుంటారు. బుధవారం బక్రీద్ పండుగ జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. బక్రీద్ పండుగ రోజున జరిగే సామూహిక నమాజ్ కోసం జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి.అదేవిధంగా ఆయా వార్డులలో ని మసీదులు విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం పన్నెండవ నెల అయిన జిల్ హజ్10 తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ముస్లిం సోదరులు మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్ర కూడా చేస్తారు. ఈ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్లి మజీద్ అల్ హరమ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు.ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తర్వాత జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను 'ఈదుల్ జుహా' అని కూడా అంటారు. బక్రీద్ రోజున ప్రార్ధనల ద్వారా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తుంది. ఈ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బక్రీద్ పండుగ రోజున శివారు ప్రాంతాలలోని ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణ మండల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంటారు.