Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
- ఎమ్మెల్యే లింగయ్య బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలి
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-కేతెపల్లి
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ఈనెల 13న దళిత బాలిక చింతమల్ల ప్రీతిపై లైంగికదాడి చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని కెేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ప్రీతి కుటుంబ సభ్యులను ఆయన ఆ సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు కొండేటి శ్రీను, పాలడుగు నాగార్జునలతో కలిసి పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పడేసిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బాలిక ప్రీతి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన కేతేపల్లి ఎస్ఐని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ వైపు దళిత సాధికారత దళిత బంధు అంటూ ఊదరగొడుతుంటే మరోవైపు రాష్ట్రంలో మరియమ్మ, ప్రీతి వంటి దళిత మహిళల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. ప్రీతి తల్లిదండ్రులు తమకున్న ఇద్దరు పిల్లలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీసం నివాస గృహం కూడా లేదన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడెకరాల భూమితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు దళితుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రీతి కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. లేనట్గయితే దళిత ద్రోహిగా ప్రకటించాల్సి వస్తుందన్నారు. ఈ ఘటనపై కెేవీపీఎస్ దశాలవారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమములో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు పత్రం శ్రీనివాస్, దళిత వాడల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య , మహిళా నాయకురాలు వస్కుల సైదమ్మ, జిల్లా కమిటీ సభ్యులు వంటేపాక కృష్ణ, వ్యకాస నాయకులు చింతపల్లి లూర్దు మారయ్య , సీఐటీయూ నాయకులు ఆది మల్ల సుధీర్, ఎస్ఎఫ్ ఐ నాయకుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.