Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలలుగా అందని వేతనాలు
- పట్టించుకోని ప్రభుత్వం
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
కరోనా మొదటి, సెకండ్ వేవ్‌లో తమ ప్రాణాలను తెగించి వైద్య సేవలు అందించి, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పారామెడికల్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు హెల్త్ వర్కర్స్ 1,527మంది పనిచేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒకటి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 2003లో జీవో ఎంఎస్ నెంబర్ 217, 459, 273, 1207 ల ప్రకారం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా జిల్లాలో 4 ఫార్మసిస్ట్, 35 మంది హెల్త్ అసిస్టెంట్లను, 2 ల్యాబ్ టెక్నీషియన్లను రిక్రూట్మెంట్ చేసుకున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో విద్యా అర్హత ఆధారంగా ఒప్పంద ప్రాతిపదికన 18 ఏండ్ల క్రితం వీరిని ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో నియామకం చేసింది. జీవో నెంబర్ 16 ప్రకారం వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, కోర్టులో స్టేతో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఆగిపోయింది. తుది తీర్పు లోబడి ప్రభుత్వ వైద్య శాఖలో అర్హులైన వారిని రెగ్యులర్ చేయవచ్చు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ నుండి నాలుగు నెలలుగా వేతనాలు అందించడం లేదు. అయినప్పటికీ పారామెడికల్ సిబ్బంది 16 నెలల నుంచి కరోనా వ్యాధి నివారణ, నిర్ధారణ పరీక్షలు, కరోనా రోగులకు చికిత్సలు చేస్తూనే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతి సంవత్సరమూ వచ్చే పొడిగింపు ఉత్తర్వులు ముడిపడి వేతనాలు వస్తాయి. ప్రభుత్వం 2021- 2022 ఉత్తర్వులు వెంటనే జారీచేసి సకాలంలో వేతనాలు అందేలా చేయాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కరోనా సేవలో వీరిదే కీలక పాత్ర
కరోనా రోగులను గుర్తించడంలో హెల్త్ అసిస్టెంట్లు కీలకపాత్ర పోయించారు. కరోనా ర్యాపిడ్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు చేశారు. వారికి కావలసిన మెడికల్ కిట్లు అందజేశారు. ఐసోలేషన్ వార్డులోకి తరలించడం జాగ్రత్తలు సూచించడం ఇంటింటి సర్వేలు, చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యాక్సింగ్ ఆన్‌లైన్‌్ రిజిస్ట్రేషన్లు, వ్యాక్సిన్ సరఫరా , కరోనా రోగులను ప్రతిరోజూ పర్యవేక్షించి వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పారామెడికల్ సిబ్బంది వైద్య సేవలను గుర్తించి వారికి నెలసరి వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించాలని కోరుతున్నారు.