Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జయప్రదం చేయండి
- ఐద్వా జాతీయ నాయకురాలు జ్యోతి
నవతెలంగాణ - సూర్యాపేట
సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర తృతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం జాతీయ నాయకురాలు టి.జ్యోతి తెలిపారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం పట్టణంలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు జంపాల స్వరాజ్యం అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై తమ సంఘం ఉద్యమాలు చేస్తుందన్నారు. వరకట్న నిరోధక చట్టం, ఆడపిల్లలకు చదువుకునే హక్కు, పుట్టిన ప్రతి ఆడ బిడ్డకూ ఆస్తి హక్కు కావాలని సంఘటితంగా ఉద్యమాలు చేస్తున్నదన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు, హత్యలు, లైంగిక దాడులు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశంలోనూ మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయన్నారు. 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి లోకసభలో ఎందుకు ఆమోదింపజేయడం లేదని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ పాలకులు ఎన్నికల సందర్భంలో మహిళలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఆచరణలో అమలు చేయడం లేదన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతో మహిళలు అనేక రంగాల్లో వెనుక బడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో విధానపర నిర్ణయాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆహ్వాన సంఘం ఎన్నిక
అనంతరం మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రకటించారు. అధ్యక్షులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, చైర్ పర్సన్‌గా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మీ, కోశాధికారిగా మేకనబోయిన సైదమ్మ, చీఫ్ ఫ్యాట్రన్స్గా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్‌రావు, మున్సిపల్ చైర్మెన్ పెరుమళ్ల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి, మహిళా కౌన్సిలర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర సీనియర్ నాయకురాలు బత్తుల హైమావతి, రాష్ట్ర అధ్యక్షురాలు కెఎన్.ఆశాలత, కోశాధికారి రత్నమాల, రాష్ట్ర నాయకురాలు స్వర్ణ, జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, టీఎస్ యూటీఫ్ జిల్లా మహిళా నాయకురాలు అరుణభారతి, ఆర్కెఎల్కె విద్యా సంస్థల అధినేత, కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ, ఐద్వా జిల్లా నాయకురాలు ఝాన్సీ, నారాయణమ్మ, ఎల్గురి జ్యోతి, కొప్పుల రజిత, కోట సృజన, మమత, ప్రజా సంఘాల నాయకులు ములకలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, కోట గోపి, ఎల్గురి గోవింద్, మట్టిపల్లి సైదులు, దండా వెంకట్‌రెడ్డి, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, మామిడి సుందరయ్య, సాయికుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.