Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాల్లో సెంట్రల్ నర్సరీలు ఏర్పాటు చేయండి
- హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ అవసరం
- పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడూ చేపట్టాలి
- ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
పట్టణాల్లో సెంట్రల్ నర్సరీల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత కల్పించాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పట్టణాల్లో లేఅవుట్లను పరిశీలించి ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల్లో ప్రభుత్వ, ప్రయివేటు భూములను సేకరించి లేఅవుట్లను ఎప్పటికప్పుడూ అభివృద్ధి చేయాలని సూచించారు. లేఅవుట్లకు పది శాతం కంటే తక్కువ భూమి ఇస్తే వెంటనే రికవరీ చేయాలన్నారు. హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీగార్డ్స్ ఏర్పాటుతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. చర, స్థిరాస్తులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ కమిషనర్లు రామానుజులరెడ్డి, గోపయ్య, శ్రీనివాస్, నరేష్‌రెడ్డి, నాగేంద్రబాబు, ఏవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.