Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
మండలంలోని రాచకొండకు వెళ్లే ప్రధాన రోడ్లు అతి ప్రమాదకరంగా మారాయి. పట్టించుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏడాది కాలంగా పట్టించుకోవడం లేదు. రోడ్ల వెంట వెళ్లేవారు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదానికి గురికాక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాచకొండకు వెళ్లే ప్రధాన రోడ్లు అయినా కడపగండితండా, దోనలతండా మధ్య గల తారు రోడ్డు, అల్లాపురం, నారాయణపురం గ్రామాల మధ్య గల రోడ్డు, అల్లాపురం, తూంబాయితండాల మధ్యగల రోడ్లు సంవత్సరం కిందట కురిసిన వర్షానికి గుంతలు పడి కొట్టుకుపోయాయి. ఏడాది కావస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోని దుస్థితి నెలకొంది. రాచకొండకు ప్రతిరోజు హైదరాబాద్‌కు చెందిన వందలాది మంది యువకులు పర్యటన నిమిత్తం వస్తుంటారు. ఈ గుంతలో పడి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నారాయణపురం రాకుండా రోడ్లు తెగిపోవడం మూలంగా అగిపోయింది. దీంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్ల, తిప్పాయి గూడెం, మంచాల, ఇబ్రహీంపట్నం తదితర గ్రామాలకు వెళ్లేందుకు నారాయణపురం గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాచకొండ పరిధిలోని తుంబారు తండకడీళ్లబాయి తండా, దోనల తండా, గుడితండాలకు చెందిన గిరిజనులు అనునిత్యం నారాయణపురం మండలానికి వచ్చి వెళుతుంటారు. ఈ ప్రమాదకరమైన రోడ్లతో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి దాపురించింది.వెంటనే సంబంధిత అధికారులు గాని ప్రజా ప్రతినిధులు పట్టించుకోని రోడ్లను మరమ్మతు చేయాలని పలువురు ప్రజలు గిరిజనులు కోరుతున్నారు.
ఎస్టిమేషన్ వేశాను నిధులు మంజూరు కాలేదు
పీఆర్ ఏఈ సందీప్ రెడ్డి
బదిలీపై ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది. అయినా రోడ్లు తెగిపోయిన విషయం నా దష్టికి వచ్చింది. వెంటనే ఎస్టిమేషన్ వేసి పంపించాను.నిధులు మంజూరు కాలేదు. సర్పంచ్‌లను పిలిచి గ్రామ పంచాయతీ నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచించాను. సర్పంచులు పట్టించుకోవడం లేదు.