Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
క్విట్ఇండియా స్ఫూర్తితో కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక ,వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 24 నుండి ఆగస్టు 9 వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించబోయే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అఖిల భారత వ్యవసాయకార్మికసంఘం జాతీయకౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు.బుధవారం జిల్లాకేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో నిర్వహించిన సీఐటీయూ, తెలంగాణ రైతుసంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు.పది నెలలుగా దేశవ్యాప్తంగా రైతాంగం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తుంటే కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదన్నారు.దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత కార్మికహక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు.8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచడం కార్మికుల పొట్టగొట్టడంలో భాగమేనన్నారు.ఉపాధిహామీచట్టంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను కులాలవారీగా వేతనాలు చెల్లించాలని కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సర్య్కులర్ను వెంటనే రద్దు చేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెంచుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ధరలు పెరగడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు, సీఐటీయూ జిల్లా నాయకులు శీతల రోషపతి, రాంబాబు, కోటగిరి వెంకట్ నారాయణ,చెరుకుయాకలక్ష్మీ, సోమన్న, తెలంగాణ రైతుసంఘం జిల్లా నాయకులు కొప్పులరజిత, ఉప్పలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసు సత్యం,అల్లిమల్లయ్య పాల్గొన్నారు.