Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన ప్రాణం నష్టం
- రాకపోకల నిలిపివేత
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి కొండపైకి వెళ్లే కొత్త ఘాట్ రోడ్డులో టూరిజం హోటల్ టర్నింగ్ వద్ద బండరాళ్లు గురువారం జారిపడ్డాయి. ఆ సమయంలోభక్తులెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కొత్త ఘాటు రోడ్డులో కొండబండ విరిగిపడడంతో రాకపోకలు నిలిపివేసి పాత ఘాటు రోడ్డు నుండి రాకపోకలు పునరుద్ధరించారు. నాలుగైదు రోజులు ఉపరితల అవర్తన ప్రభావంతో ఇక్కడ కురుస్తున్న ఎడతెరిపిలేని ముసురు కారణంగా రెండవ ఘాటురోడ్డులో ఉన్న కొండకు ఎలాంటి రక్షణ చర్యలు లేవు. కొండపైన ఉన్న రాళ్ళ కింద ఉన్న మట్టి కరిగి జారిపోవడంతో బండరాళ్లు కొత్త ఘాటురోడ్డుపై పడిపోయాయి. దీంతో ఘాటు రోడ్డులో రాకపోకలు ఆఫీసర్లు నిలిపివేశారు. ఇప్పటికి వర్షంలో తడిసిన కొండ మళ్ళీ బండరాళ్లు జారిపడుతుందేమో ఆందోళనకర పరిస్థితైతే ఉంది. వెంటనే కొండ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం కొండను తొలిచి కొండ మధ్య నుండి రోడ్డును నిర్మాణం చేశారు. కాగా కొండపైన బాలాలయం ఏరియా అంత అస్తవస్థంగా మారింది. బాలాలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు వర్షం కారణంగా నేలకులాయి. పార్కింగ్ స్థలం నుండి బాలాలయం వెళ్లే మార్గం నీటి కారణంగా కోతకు గురైంది. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొండబండలు విరిగిన ఘాటురోడ్డులో పడిన ప్రాంతాన్ని అధికారులు పరిలించి తొలగింపు చర్యలు చేపట్టారు. చలువ పందిళ్లు సరిచేశారు. పునర్నిర్మాణం అవుతున్న ప్రధానాలయంలోకి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన నూతన క్యూలైన్లోకి వర్షం నీరు చేరాయి. వైటీడీఏ ఈఈ శంకరయ్య నేతత్వంలో ఆఫీసర్లు జారిపడిన బండరాళ్లను, క్యూలైన్ లో నీటిని తొలగింపు చర్యలు చేపట్టారు.