Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
జీపీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, దళిత సాధికారత సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులకు పీఆర్సీ కనుగుణంగా వేతన జీవోలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.శుక్రవారం మండలకేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల జనరల్ బాడీ సమావేశం రావిరాల శ్రీను అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల మెడ మీద కత్తిలా వేలాడుతున్న మల్టీపర్పస్ విధానంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివిధ శాఖలు, సంస్థలు,కార్పొరేషన్లలో పని చేస్తున్న పర్మినెంటు ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతూ జీవోలు ఇచ్చిందన్నారు.వీరితో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల వేతనాలు కూడా పెంచింద న్నారు.పెరుగుతున్న ధరలను దష్టిలో పెట్టుకొని వెంటనే పీఆర్సీ జీవో నెం 60,64లను సవరించి జీపీ కార్మికులకు నెలకు రూ.19 వేల ఇవ్వాలని కోరారు.కరోనా కష్టకాలంలో పని చేసినందుకు రెండునెలల ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం, సీఐటీయూ మండలకన్వీనర్ ఎసరాని శ్రీనివాస్, యూనియన్ మండల అధ్యక్షులు చలిచీమల శంకరయ్య, నాయకులు యర్రగోని లింగయ్య, ఎర్రఅరుణ, ఈశ్వరయ్య పాల్గొన్నారు.