Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణమాఫీ లేదు.. రుణాలూ లేవు
- పెండింగ్ ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ ఎందుకు
- నేడు నల్లగొండ జెడ్పీ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందంటే జిల్లాలోని అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని ప్రజలు, ప్రతిపక్షాలు భావిస్తుంటారు. కానీ ప్రజల ఆశలకు భిన్నంగా జెడ్పీలో సమావేశాల చర్చలు జరుగుతున్నాయి. ఏండ్ల తరబడి పేరుకు పోయిన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్న పరిస్థితి ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ పెత్తనం సాగడానికి జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పోటీ పడడంలేదు. అందుకే ప్రజలెవరూ జిల్లా పరిషత్ సమావేశం అంటే ఒరిగేదేముందిలే అన్న చందంగా చూస్తున్నారు. కనీసం ఈసారైనా నేడు జరిగే సమావేశంలో గతానికి భిన్నంగా ప్రజా సమస్యలపై చర్చ జరిగితే మంచి ఫలితాలు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.
రుణమాఫీ లేదూ.. రుణాలు లేవూ...
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 వరకు రైతులు తీసుకున్న పంటరుణాలు మాఫీ చేస్తామని, అవి కూడా నాలుగు విడతలుగా పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఏ రైతుకూ చిల్లి గవ్వ చెల్లించలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేసిందనే ధీమాతో అన్నదాతలెవరూ బాకిపడిన పంటరుణాలను తిరిగి చెల్లించలేదు. ఇప్పుడు పంటలు సాగుచేస్తున్న రైతులకు పంటరుణాలు కావాలని బ్యాంకుల వద్దకు వెళ్తే పెండింగ్ రుణాలను చెల్లిస్తేనే తిరిగి రుణాలు ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది.
ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ...
జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామని చెపుతున్నప్పటికీ సాగుకు అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించడం లేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం లక్ష ఎకరాలకు సాగు నీరందించడానికి రూ.699 కోట్లతో ప్రారంభించారు. మూడేండ్లల్లో పూర్తి చేయాల్సి ఉండగా నేటికి పూర్తికాలేదు. 3.40లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు నక్కలగండి ప్రాజెక్టు 2015లో రూ.6190 కోట్ల నిధులతో ప్రాజెక్టును మంజూరు చేశారు. ఆ ప్రాజెక్టు పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. ఇవేగాకుండా చాలా ప్రాజెక్టులు, వరద కాల్వలు నిర్మాణానికి నోచలేదు. దానికి ప్రధాన కారణం నిధులు కేటాయించక పోవడమే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రాజెక్టులపై చర్చ చేసి నిధులు విడుదల చేయించాలని రైతులు కోరుతున్నారు.
ధాన్యం సొమ్ములో కోత
ఆరుగాలం పండించిన పంటను రైతులు అమ్మితే ధాన్యంలో మట్టిపెల్లలు, తాలు పేరుతో కొనుగోలు చేస్తున్న అధికారులు తూకం చేసిన ధాన్యంలో కోత విధించి సొమ్మును కాజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు చెందిన రూ.కోట్లు ముంచేశారు. ధాన్యం సొమ్ములో కోత విధించిన వారిపై ఇటీవలే నకిరేకల్ చెందిన ఓ రైతు ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆయన సొమ్ము తిరిగి చెల్లించారు. అంతే కాకుండా నాంపల్లి మండలంలో కూడా కొనుగోలు చేసిన ధాన్యంలో కేంద్రం నిర్వహకులు కోత విధించినట్టు సమాచారం. దీనిపైనా జెడ్పీ సమావేశంలో చర్చ చేసి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.