Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వేణు
నవతెలంగాణ - చివ్వేంల
సామాన్య ప్రజలు చట్టాల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వేణు కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మండల న్యాయ సేవా సమితి, సూర్యాపేట జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం మండలపరిధిలోని మున్యానాయక్ తండాలో భారత్ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించిందన్నారు. హక్కులతో పాటు బాధ్యతలూ ఉన్నాయని, ప్రతి పౌరుడూ విధిగా బాధ్యతలు నెరవేర్చాలని సూచించారు. భ్రూణ హత్యలు, చిన్నారుల పట్ల హింసకు పాల్పడే కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకోవద్దన్నారు. ఆడపిల్లలకు వివాహ వయస్సు రాక ముందే పెండ్లి చేయడం అమానుషమని అన్నారు. మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం, గిరిజనుల హక్కులు, ఆస్తి హక్కులు, జాతీయ ఆహార భద్రత చట్టం, జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ గిరిజనులకు ఏర్పాటు చేసిన న్యాయ సేవల పథకం, న్యాయ సహాయంపై ఆయన వివరించారు. అనంతరం సూర్యాపేట రెవెన్యూ డివిజన్ అధికారి రాజేందర్‌కుమార్ రెవెన్యూ చట్టాలు, సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్ క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. మండల అభివృద్ధి అధికారి జమాలరెడ్డి పంచాయతీరాజ్ చట్టాలు, ప్రజల హక్కులపై అవగాహన కల్పించారు. ఎంపీపీ ధరావత్ కుమారి బాబునాయక్, ఎంపీటీసీ సుశీలసాగర్, గ్రామ సర్పంచ్ బికారినాయక్ మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా ఉండి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. పారా లీగల్ వాలంటీర్ జె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చట్టాల అవగాహనపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రంగారావు, ఎస్సై విష్ణుమూర్తి, డీసీపీవో రవి, ఏసీడీపీవో సాయి, గీత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.