Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్
నవతెలంగాణ - సూర్యాపేట
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే అన్ని కేటగిరీల కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని తెలంగాణ మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 11వ పీఆర్సీ కమిషన్ చైర్మెన్ ప్రతిపాదించిన కేటగిరీల వారీగా పారిశుధ్య కార్మికులు రూ.19 వేలు, డ్రైవర్లకు రూ. 22,950, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.31,040 వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సఫాయి కార్మికులు దేవుళ్లు అని చెప్పిన సీఎం కేసీఆర్ నేడు వారిని విస్మరిస్తున్నారని అన్నారు. కరోనా కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పట్టణాలను శుభ్రం చేస్తున్న కార్మికులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరోనాతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వన్‌టౌన్, టూ టౌన్ కార్యదర్శులు కోట గోపి, ఎల్గూరి గోవింద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిడి సుందరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి చాగంటి రమణ, అధ్యక్షుడు వల్దాస్ మధుసూదన్, కోశాధికారి శివ, నాయకులు దశరథ, మురళి ముదిగొండ ఎల్లమ్మ, నర్సమ్మ, మయూరి, బిక్షం తదితరులు పాల్గొన్నారు.