Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- నల్గొండ
కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ పట్టణ 7వ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకూ ప్రజల తరపున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ల ప్రయోజనాలకోసం దేశసంపదను లూటీ చేస్తుందని విమర్శించారు. ఇందులో భాగంగానే రైతు, కార్మిక వ్వతిరేక చట్టాలను తెచ్చారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని తెలిపారు. ఈ విధానాలను మానుకోకపోతే ప్రతి ఘటన పోరాటాలు తప్పవని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ధరలను అదుపుచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. స్థలాల కోసం ప్రజలు పోరాటాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తున్నదని విమర్శించారు. పేదలకు ఇవ్వడానికి భూములు లేవని చెబుతూనే కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాల భూములు అమ్ముతోందన్నారు. పట్టణంలో డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. అంతకుముందు ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉట్కూరు నారాయణరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ మహాసభకు ఆ పార్టీ పట్టణ నాయకులు దండెంపల్లి సత్తయ్య, కుంభం కష్ణారెడ్డి, తుమ్మల పద్మ, గాదె నరసింహ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ మహాసభలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఎండి.సలీం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హశం, పాలడుగు ప్రభావతి, పుచ్చకాయల నర్సిరెడ్డి ,దండెంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, మైల యాదయ్య, పాక లింగయ్య, భూతం అరుణ, మధుసూదన్ రెడ్డి ,లింగమ్మ, రుద్రాక్షి శేఖర్, సైదా చారి, నగేష్, మల్లేష్, మారయ్య, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.