Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నాంపల్లి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 50కు పైగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన లబ్దిదారులకు రేషన్ కార్డులు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు, నీటి సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. మునుగోడులో 1979లో మొదలైన ప్లోరైడ్ భూతం నియోజకవర్గం దాటి 1000 గ్రామాలకు విస్తరించిందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించి మంచి నీటి సమస్య పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్, రైతుబంధు కింద ఎకరానికి రూ.10,000 పెట్టుబడి సాయం, రైతుబీమా, తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. నాంపల్లి మండలంలో బస్టాండ్ ఏర్పాటు సమస్యకు పరిష్కారం చూపనున్నట్టు తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ మాట్లాడుతూ మండలంలోని 456 మందికి, మర్రిగూడ మండలానికి చెందిన 390 మంది లబ్దిదారులకు నూతన ఆహార భద్రతా కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పానుగంటి రజని వెంకన్నగౌడ్, సర్పంచ్ కుంభం విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, కర్నాటి విద్యాసాగర్, తహసీల్దార్ లాల్‌బహదూర్, దేశ్యనాయక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేషు కుమార్, రమేష్ దీన్ దయాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.