Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.85 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, టెండర్లు పూర్తయి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించని వైనం
- ఇసుక సమస్యతో లేట్ అవుతుందంటున్న ఆఫీసర్లు
- అధికారుల పనితీరు పట్ల ఎమ్మెల్యే అసంతప్తి
నవతెలంగాణ- మోత్కూరు
మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించడంలేదు. పట్టణంలోని పలు వారుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు నిధుల మంజూరుతో పాటు టెండర్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యమో మరేమోగాని అభివద్ధి పనులు మాత్రం జరగడం లేదు. 2018 ఆగస్టు 2న మోత్కూరు కొత్త మున్సిపాలిటీగా ఏర్పడి మూడేండ్లు కావస్తున్నా...2020 జనవరి 27న మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరి ఏడాదిన్నర గడిచినా నేటికీ మున్సిపాలిటీలో చెప్పుకోదగ్గ ఒక్క అభివద్ధి పని కూడా జరగలేదు.
రూ.85 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం
మున్సిపాలిటీలో 1, 3, 4, 5, 7, 9, 12 వార్డుల్లో 11 చోట్ల సీసీ రోడ్లు, ఆరు చోట్ల మురికి కాల్వలు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో సీసీ రోడ్డుకు రూ.5 లక్షల చొప్పున 11 సీసీ రోడ్లకు రూ.55 లక్షలు, మురుగు కాల్వకు రూ.5 లక్షల చొప్పున ఆరు మురుగు కాల్వలకు రూ.30 లక్షలు కేటాయించారు. అందులో ఏడు సీసీ రోడ్లు, మూడు మురుగు కాల్వలకు టెండర్లు పూర్తయి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోగా అగ్రిమెంట్ కూడా పూర్తయ్యిందని మున్సిపల్ అధికారులు తెలిపారు. మరో ఏడు పనులకు కూడా టెండర్లు పూర్తవ్వాల్సి ఉందన్నారు. రూ.50 లక్షల పనులకు టెండర్లు పూర్తయి సుమారు ఐదారు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం జరగడం లేదు. వానలు పడే సమయంలో వాటి నిర్మాణం చేపడితే నాణ్యతగా ఎలా ఉంటాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇసుక సమస్యతో లేట్ అవుతుందంటున్న ఆఫీసర్లు
సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు ఇసుక సమస్య కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మోత్కూరులోని బిక్కేరు వాగు నుంచి ఇసుక తీసుకెళ్లకుండా హైకోర్టు స్టే ఉన్నందున ట్రాక్టర్లతో ఇసుక తీసుకెళ్లేందుకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని మున్సిపల్ అధికారులు చెబుతుండగా, ఇసుక కోసం మున్సిపాలిటీ నుంచి లెటర్ పెట్టారని, పొడిచేడు మూసీ నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ట్రాక్టర్కు రూ.450 చలాన కడితే తాము అనుమతి ఇస్తామని చెప్పామని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా ఆఫీసర్లు తలుచుకుంటే ఇసుక ఎందుకు దొరకదని, కమిషన్ల కోసమేమైనా పనులు లేట్ చేస్తున్నారేమోనని, ఇప్పటికే పైప్ లైన్ పగిలిందనో, దిమ్మె కట్టామనో, మొరం పోశామనో ఇష్టారీతిన బిల్లులు డ్రా చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా 9వ వార్డు కౌన్సిలర్ దబ్బెటి విజయరమేష్ తన వార్డు పరిధిలోని జామచెట్లబావిలో రూ.5 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు పనులు ఆలస్యమవుతుండటంతో ఎడ్ల బండ్లతో ఇసుక తరలించి రెండు రోజుల క్రితం సీసీ రోడ్డు పోయించడం గమనార్హం.
అధికారుల పనితీరు పట్ల ఎమ్మెల్యే అసంతప్తి
మున్సిపాలిటీలో అభివద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నా, కొన్ని పనులకు టెండర్లు పూర్తయినా సకాలంలో పనులు చేయించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ దష్టికి వెళ్లడంతో ఆయన అసంతప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీ అభివద్ధిపై ఎమ్మెల్యే పలుమార్లు రివ్యూ నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదంటున్నారు. ఏదేమైనా మున్సిపాలిటీలో ఆశించిన అభివద్ధి పనులు జరగకపోవడం పట్ల ప్రజల్లో మాత్రం అసంతప్తి నెలకొని ఉంది.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
షేక్ మహమూద్, మున్సిపల్ కమిషనర్, మోత్కూరు
మున్సిపాలిటీలో టెండర్లు పూర్తయిన సీసీ రోడ్లు, మురుగు కాల్వల పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. ఇసుక, కరోనాతో లేబర్ సమస్య కారణంగా పనులు చేయడంలో ఇబ్బంది జరుగుతుంది. కమిషన్ల కోసం పనులు ఆలస్యమవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. సమస్యలను అధిగమించి అభివద్ధి పనులను పూర్తి చేయిస్తాం.
అభివద్ధి పనులు చేపట్టాలి
బొల్లు యాదగిరి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు, మోత్కూరు
మున్సిపాలిటీలో పాలకవర్గం ఏర్పడి ఏడాదిన్నర గడిచిపోయినా ఆశించిన అభివద్ధి జరగడం లేదు. చాలా బజార్లలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టెండర్లు పూర్తయిన పనులను త్వరితగతినపూర్తి చేయాలి. అన్ని బజార్లలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలి.