Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపాలిటీలోని సిల్క్ నగర్, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మధ్య రత్నాలవాగులో వరద ప్రవాహానికి కోతకు గురై కూలిపోయే దశలో 33 కేవీ విద్యుత్ స్తంభాలు 5 నుండి 6 వరకు వున్నాయి. రియల్ బూమ్ కారణంగా రత్నాలవాగు ఇరువైపుల ఆక్రమణకు గురి కావడంతో ఇరుకుగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరద ప్రవాహంతో సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాల కింద భూమి కోతకు గురైంది. స్తంభానికి సమీపంలో ఒకవైపు సిల్క్నగర్ కాలనీ, మరోవైపు ఆర్పీఆర్పీ గురుకుల పాఠశాల, కళాశాల ఉంది. నిత్యం అటుగా విద్యార్థులు, కాలనీకి చెందినవారు తిరుగుతుంటారు. ఎప్పుడు కూలిపోతాయోనన్న భాయాందోళనలో ప్రజలు ఉన్నారు. బహదూరుపేట ప్రధాన రోడ్డువెంట మార్కండేయ కాలనీ వద్ద విద్యుత్ తీగలకు చెట్లు కొమ్మలు అల్లుకుపోయి మనిషికి అందె ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి .దీని వలన వర్షం కురిసినప్పుడు విద్యుత్ ప్రసరణ జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశం వున్నది. సమస్యలు గుర్తించి విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్సంభాలు కూలిపోకుండా చర్యలు తీసుకోవాలి : బంధెల సుభాష్, స్థానికుడు
రత్నాల వాగు కిరువైపులా విద్యుత్ స్తంభాలు నీటి ప్రవాహంతో కూలిపోయే ప్రమాదం ఉంది.33 కేవీ విద్యుత్ ఈ ప్రాంతంలో సరఫరా అవుతుంది. కూలిపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశముంది. మార్కండేయనగర్లో భూమికి ఆనుకుని తిప్ప తీగ విద్యుత్ తీగలకు అల్లుకుపోయింది . రానున్న వర్షాకాలంలో విద్యుత్ భూమికి సరఫరా అయి అటుగా తిరిగే పాదచారులకు ప్రమాదం పొంచి ఉంది. వెంటనే విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకుని ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి .