Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతినెలా రూ.200 డొనేట్ చేస్తున్న గ్రూప్ సభ్యులు
- 8 నెలల్లో లక్షకు పైగా ఆర్థికసాయం
- 5 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసరాల అందజేత
నవతెలంగాణ-నకిరేకల్
ఎన్నో వాట్సాప్ గూప్స్ చూసి ఉంటారు.కానీ సేవ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది తెలుసా? అదే లిటిల్ సోల్జర్స్ రూ.200 గ్రూప్.కష్టం ఉందని చెబుతుంటే వినటానికే ఆసక్తి చూపని ఈ రోజుల్లో కులాలకతీతంగా ఎవరు ఆపదలో ఉన్న సహాయం చేస్తున్నారు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో 2020 నవంబర్‌లో నకిరేకల్‌కి చెందిన లిటిల్‌సోల్జర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మదేవర నరేష్, కర్నాటి నరేష్ ఈ గ్రూప్‌కు రూపకల్పన చేశారు.ఇందులో అనేక వృత్తుల వారు, ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు ఉన్నారు.వేర్వేరు జిల్లాలకు చెందిన వారు సైతం వీరి సేవని చూసి స్వచ్ఛందంగా చేరుతున్నారు.
ఎందరో చిన్నారులకి వైద్య సహాయం
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులను చూసి ఫ్రీ రైస్ ఏటీఎం, ఘర్ పర్ చావల్‌లో భాగంగా 400 కుటుంబాలకి పైగా రైస్, నిత్యావసరాలు అందించారు.పేదరికంతో బాధపడుతూ చిన్నపిల్లల వైద్యానికి డబ్బులు కావాలని చాలా మంది సంప్రదించడంతో గతేడాది నవంబర్‌లో 10 మందితో వాట్సాప్ గ్రూపును ప్రారంభించారు.మొదట్లో 10మంది మాత్రమే 200 డొనేట్ చేయడంతో ఎక్కువ సాయం చేయలేకపోయామని, సభ్యులు సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 102కు చేరడంతో మరికొంత ఎక్కువ సాయం చేయ గలుగు తున్నారు.ప్రతినెలా ప్రతి ఒక్కరం రూ.200 ఇస్తూ వచ్చిన మొత్తాన్ని ఆపదలో ఉన్నవారికి స్వయంగా వెళ్లి సహాయ అందిస్తున్నారు.చేస్తున్న సాయం వృథాగా పోదని తిరిగి మనకు, మన పిల్లలకు మేలు చేస్తుందని గ్రూప్ సభ్యులు పేర్కొంటున్నారు.
గ్రూప్ సభ్యుల సహకారంతో రూ.లక్ష పైగా సహాయం
మొదటగా నకిరేకల్ కి చెందిన నర్సింహారాజ వాళ్ళ చిన్నబాబు గుండె ఆపరేషన్‌కు దాతల సహకారంతో రూ. 60వేలు అందించారు.కామారెడ్డికి చెందిన నవీన్, సౌజన్యల చిన్నారికి లివర్ మార్పిడి కోసం రూ.20వేలు,బేబీ కిట్, తల్లిదండ్రులను కోల్పోయిన నిడమనూరు మండలం ముకుందా పురం గ్రామం చిన్నారులు నేహా, వర్షిత్ కుటుంబానికి, పెదవూర మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన యాదగిరి కుటుంబాలకు రూ.10 వేలు,50కేజీల బియ్యం,పన్నాలగూడెంకు చెందిన మహేష్, దివ్యల చిన్నబాబుకు గుండె ఆపరేషన్ కోసం రూ.12 వేలు, నకిరేకల్‌కు చెందిన గణేష్,కవితల కుమారుని గుండె ఆపరేషన్ కోసం రూ.11 వేలు,50 కిలోల బియ్యం అందజేశారు. ఊపిరితిత్తులలో కంతి ఉన్న చిన్నారి తల్లిదండ్రులు శివశంకర్, ప్రియాంకలకు రూ 8వేలు,మద్దిరాల మండలం చిన్న నెమ్మల గ్రామ గీత కార్మిక కుటుంబానికి రూ.5 వేలు, 50 కేజీల బియ్యం, శాలిగౌరారంకు చెందిన కార్తీక్ రోడ్డు ప్రమాదానికి గురికాగా ఆ కుటుంబానికి రూ.5వేలు అందజేశారు.కండరాల క్షీణతతో బాధపడుతున్న నేరేడకు చెందిన గోపాల్ కుటుంబానికి, పెద్ద సూరారంకు చెందిన వద్దులు బుచమ్మ,లింగయ్య కుటుంబాలకి రూ.3 వేల చొప్పున,50కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు.తలసేమియాతో బాధపడుతున్న నల్లగొండ చిన్నారి శ్రీజకు రూ.4 వేలు, బియ్యం, అదేవిధంగా 10 నిరుపేద కుటుంబాలకు 25 కిలోల బియ్యం చొప్పున సహాయం అందించారు.సామాజిక మాధ్యమంలో మరింత స్పందన వాట్సాప్ గ్రూప్ ద్వారా సహాయం అందించిన వారి కష్టం, బాధ అందరికీ తెలిసేలా వీడియో చేసి సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేస్తున్నారు.అది చూసి వారికి మరింత మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నిడమనూరులో తల్లిదండ్రులు చనిపోయి నేహా, వర్శిత్ చిన్నారులకు సహాయం అందించి సోషల్ మీడియాలో పెడితే ఒకరు ముందుకి వచ్చి ఆ చిన్నారుల 20సం.ల వరకు మాదే పూర్తి బాధ్యత తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు కూడా మీరు మాకు సహాయం అందించిన వీడియో చూసి చాలా మంది మరింతసాయం చేశారని, మీ వల్లే మా చిన్నారి మాకు దక్కిందని మీ లిటిల్ సోల్జర్స్ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని అనడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. డబ్బులు లేక ఆపదలో ఉన్నారని తెలిస్తే గ్రూప్ సభ్యులకు సమాచారం అందించి, వీలు ఉన్న వారందరూ ఎంత దూరం అయినా వెళ్లి సహాయం అందిస్తామని సభ్యులు పేర్కొం టున్నారు.
వాట్సాప్ గ్రూప్ రూపకల్పనకు స్ఫూర్తి, లక్ష్యం
గతేడాది చిన్నబాబు వైద్యానికి డబ్బులు లేక మేము వ్యక్తిగతంగా ఈ పరిస్థితి ఎదురుకొన్నాం.ఆ బాధ మాకు తెలుసు. అలాంటి బాధలో ఉన్న కుటుంబానికి మా వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ఏర్పాటు చేశామని గ్రూప్ సభ్యులు బ్రహ్మదేవర నరేష్, కర్నాటి నరేష్ తెలిపారు.ఎక్కువమంది ఉంటే ఎక్కువ మందికి సహాయం అందించగలమని 102 మంది ఉన్న గ్రూప్ సభ్యుల సంఖ్య 200 చేరాలని ఆశిస్తున్నాం.సోషల్ మీడియా కూడా మా సేవకి మరింత ఉపయోగ పడిందన్నారు.ఇప్పటివరకు చేసిన సేవలు చూసి సభ్యులుగా స్వచ్ఛందంగా రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఈ గ్రూప్‌లో ఎవరైనా సభ్యునిగా చేరొచ్చని తెలిపారు. సభ్యులందరి ఆశీర్వాదం, సహకారం వల్ల సేవా కార్యక్రమాలు చేయగలుగు తున్నామని, ప్రతినెలా వారిస్తున్న రూ.200 విరాళం ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు.
సహాయం అందించడం సంతప్తినిస్తుంది
పోతుల నవత:(గవర్నమెంట్ టీచర్)
గ్రూప్ ప్రారంభం నుండి నేను ఉన్నా.ప్రతినెలా వచ్చిన అమౌంట్‌ని కష్టం ఎక్కడ ఉందో, సాయం అవసరం ఎక్కడ అవసరం ఉందో తెలుసుకొని ఎంతదూరమైనా వెళ్లి ఇస్తున్నారు.ఇది చాలా సంతృప్తిని ఇచ్చింది.
పేద చిన్నారుల వైద్యానికి సహాయం అందిస్తున్నాం
హరి ప్రసాద్:(పవర్ లూమ్ కార్మికుడు)
చిన్న పిల్లలకు చిన్న కష్టమొచ్చినా ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు.పేదరికంలో ఉన్న చిన్నారుల వైద్యానికి సాయం చేయడం చాలా సంతృప్తిని ఇస్తుంది.