Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
దేశంలో అమలు చేస్తున్న నరేంద్రమోడీ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం మండలపరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఆ పార్టీ గ్రామ శాఖ మహాసభలను మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరిగౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. గ్రామ శాఖ కార్యదర్శి దండు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో విఫలమ య్యారన్నారు.రోజురోజుకు మారుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయకుండా ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రం పోటీపడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రోజురోజుకు పనిచేస్తున్నారని తద్వారా అన్ని వర్గాల పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రబలిన కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేయకపోగా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం, ఆస్పత్రుల్లో కనీస వసతులు కూడా సమకూర్చడంలో విఫలమయ్యారని చెప్పారు.సీపీఐఎం నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. మండలంలో పెండింగ్లో ఉన్న బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం చిన్న నీటి వనరులు, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కృష్ణాజలాలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జిల్లాలో ఉన్న కృష్ణానది ఆధారిత ఆ ప్రాజెక్టులన్నింటికీ త్వరితగతిన పూర్తి చేసేందుకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.కమ్యూనిస్టు పార్టీ ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజలను చైతన్యం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు భవిష్యత్లో కీలకం తమపార్టీ కానుందన్నారు.ఈ శాఖ మహాసభలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామోజు వెంకటేశ్వర్లు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరిగౌడ్, మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి నర్సింహ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న, పీఏసీఎస్ డైరెక్టర్ పులిపల్లి శంకర్రెడ్డి, కేవీపీఎస్ మండల కార్యదర్శి దండు రవి, ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి దండు శంకర్, సీఐటీయూ మండల కార్యదర్శి బొల్లెద్దు సైదులు, వార్డు సభ్యులు శేఖర్, శంకర్, శ్రీను పాల్గొన్నారు.