Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -రామన్నపేట
అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని వెల్లంకి గ్రామంలో ఆ పార్టీ గ్రామ శాఖ 17వ మహాసభ గ్రామ శాఖ కార్యదర్శి వనం ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడేండ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వ వైఫల్యం వల్ల నిరాశే మిగిలిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రక్రియ అనుకూలులకు కల్పించి రాజకీయ జోక్యాలకు తావిచ్చి పేదలకు అన్యాయం చేయడం సరికాదన్నారు. రేషన్ కార్డు అందించడంలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. వేలాదిమంది నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకుని, ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల జోక్యం నివారించి, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటిమీద రాతల్లాగే మిగిలాయన్నారు. వేలాది మంది నూతన పిన్షన్ల కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. పేదలను కేవలం ఎన్నికల సరుకుగా చూస్తున్న పాలకుల వైఫల్యాలపై సీపీఐ(ఎం) బలమైన ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. అంతకుముందు మహాసభల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులు కాచం కష్ణమూర్తి వర్థంతి సందర్భంగా జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి జల్లేల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ ఎంపీటీసీ కూరెళ్ళ నర్సింహా చారి, ఎంపీటీసీ ఎర్రోళ్ళ లక్ష్మమ్మ నర్సింహా, శాఖ కార్యదర్శి వనం ఉపేందర్, ఆవనగంటి నగేష్, పాశం రాంరెడ్డి, బర్ల బాబురావు, కరకంటి మల్లయ్య, ఆవనగంటి స్వామి, మల్లేష్, పాలం అంజయ్య, హరీష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.