Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూముల సమస్య మళ్లీ పెండింగ్‌లోనే..
- సాగర్ ఇండ్లకు నెల రోజుల్లో మోక్షం కలిగేనా..
- హాలియాలో సీఎం పర్యటన..
- నిరాశతో వెనుదిరిగిన ప్రజాప్రతినిధులు
- విపక్ష నేతల ముందస్తు అరెస్టులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
'సీఎం సారు..ప్రత్యేకంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షకు వస్తుండంటే సంతోషపడ్డం..కానీ గిదేంది... నాలుగు మాటలు చెప్పి.. నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పి పోతుండు..మన సమస్యలు విననే లేదు..గింత మాత్రాన ఎందుకీ మీటింగ్' ఇదీ నాగార్జున సాగర్ నియోజక వర్గంలోని హాలియాలో సీఎం పర్యటన జరిగిన తర్వాత ఇద్దరు గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణ .
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి ఎంటో చూసి చూపిస్తానని ఎన్నికల సభలో ఇచ్చిన హామీ మేరకు సోమవారం సీఎం కేసీఆర్ హాలియా మండలంలో పర్యటించారు. అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే వాస్తవంగా సమీక్ష అంటే నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చేసి ఇంకా అవసరమైన నిధులు మంజూరు, మిగిలిన సమస్యలకు పరిష్కారం అక్కడిక్కడే చూపించాలి. కానీ దానికి పూర్తి భిన్నంగా ఇక్కడ సమీక్ష జరిగింది. సీఎం సరిగ్గా 12.40 ని||లకు వేదికపైకి చేరుకుని 1.40ని||లకు ప్రసంగం ముగించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, నియోజకవర్గం అభివృద్ధి కోసం చేసిన పనులను వివరించారు. మాజీ మంత్రి జానారెడ్డిని, ప్రతిపక్షాలను సుతిమొత్తగా విమర్శించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురగోతి ఎలా ఉంది.. ఎప్పటి వరకూ పూర్తి చేయగలరూ...లాంటి అంశాలను ఏ అధికారితోనూ చర్చించింది లేదు. కేవలం స్థానిక ఎమ్మెల్యే భగత్ నిధుల మంజూరు కోసం ఇచ్చిన దరఖాస్తులను మాత్రమే తీసుకుని వాటిపైనే మాట్లాడారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో లక్ష్మి అనే మహిళ తన సమస్యను చెప్పుకుందామని లేవగానే స్టేజీ వద్దకు తీసుకురావాలని సీఎం స్వయంగా ఆదేశించారు. కానీ పోలీసులు ఆమెను బలవంతంగా బయటికి లాక్కెళ్లి స్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి ఇంకో సమస్యను ప్రస్తావిస్తుండగా ఆయనపైనా సీఎం అసహనం వ్యక్తం చేశారు. సమీక్షలో ప్రధాన పాత్ర పోషించే అధికారి కలెక్టర్ వేదికపై ఎక్కడో వెనుకలో ఉండిపోయారు. ప్రజాప్రతినిధులను పిలిచింది ఎందుకు... ఇక్కడ జరిగిందేంటో అంటూ అసహనం వ్యక్తం చేశారు.
పోడు భూముల సమస్య పరిష్కారం మళ్లీ వాయిదా
ఎన్నికలు పూర్తయ్యాక నెలలోపే మీ ఎమ్మెల్యే భగత్‌తో వచ్చి పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపి పట్టాలిస్తానని నాడు ఎన్నికల సభలో సీఎం హామీ ఇచ్చారు. దానికి సీఎం పరిష్కారం చూపిస్తారనే ఆశ గిరిజనుల్లో నేటి వరకు ఉంది. 'పోడుభూముల చట్టాలు జరా కఠినంగా ఉన్నాయి.. అందుకే ఆలస్యమైంది. తొందరలోనే పరిష్కరిస్తాం' అంటూ సీఎం చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పారు. దీంతో గిరిజనులకు నిరాశే మిగిలింది. ఇప్పుడు కూడా కాకపోతే రానున్న రోజుల్లో సాధ్యమయ్యే పనికాదంటూ పెదవి విరుచుకుంటూ గిరిజన ప్రజాప్రతినిధులు సభ నుంచి తిరుగు ముఖం పట్టారు.
నెల రోజుల్లో పరిష్కారమయ్యేనా...
నాగార్జున సాగర్‌లో ఇరిగేషన్ భూముల్లో ఇండ్లు నిర్మాణం చేసుకుని వాటి రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నెలరోజుల్లో పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి, వాటిపై పూర్తిగా చర్చించి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇలాగే గతంలో కూడా అనేక మంది హామీ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు కూడా చేస్తారో లేదోననే అనుమానం వారిల్లో వెంటాడుతోంది.
పోలీసుల గుప్పిట్లో హాలియా...
సీఎం కేసీఆర్ హాలియా పర్యటన సందర్భంగా పోలీసులు పట్టణాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన సందర్భంగా సుమారు 3000 మంది పోలీసులను భద్రత కోసం వాడుకున్నారు. అడగడుగనా పోలీసులను ఏర్పాటు చేశారు. ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ఫలితం ప్రమాదకరంగా ఉంటుందని ముందు నుంచే పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. రోడ్ల వెంట బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ముందస్తు అరెస్టులు...
జిల్లా పర్యటనకు కేసీఆర్ వస్తున్న సందర్బంగా జిల్లాలో నాగార్జున సాగర్‌తో పాటుగా జిల్లా కేంద్రంలో బీజేపీ, సీపీఐ, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అర్ధరాత్రి నుంచే అరెస్టు చేశారు. జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మధుసూధన్‌రెడ్డి, ఇతర జిల్లా మండల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సీఎం కేసీఆర్ పోలీసులతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.