Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సందర్శించినా జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని, వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అనేక సమస్యలపై ప్రజలు పోరాడిన ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో వాసాలమర్రి, యాదగిరిగుట్ట లకు పలుమార్లు వచ్చినా ఆలేరు నియోజకవర్గానికి సాగునీరుఅందించే గంధమల్ల ప్రాజెక్టుపై నోరు మెదపడం లేదని విమర్శించారు. జిల్లాలో అధికారులతో సమీక్షలు తప్ప ఆచరణ ఏమీలేదన్నారు. జిల్లాలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. విద్యారంగం, సాగునీటి ప్రాజెక్టులు పెద్ద సమస్యగా ఉన్నాయన్నారు. రాష్ట్ర సాధనకు ముందు ఉద్యమ నాయకుడిగా ఉండి మోటకొండూరు మండలంలో వర్టుర్ గ్రామానికి పల్లె నిద్ర కు వచ్చి వారికి అనేక హామీలు ఇచ్చి రెండో దఫా ముఖ్యమంత్రి అయినప్పటికీ కనీసం వారి సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు. వారికి ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. వాసాలమర్రి గ్రామానికి పలుమార్లు పోయిన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం అభివద్ధి అధ్వానంగా మారిందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ అవి ఆచరణలో మాత్రం కింది స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 30 రోజుల పాటు జన చైతన్య పాదయాత్ర ద్వారా సుమారు 30 లేటర్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించామన్నారు. కనీసం వాటిపై సమాధానం లేదన్నారు. వెంటనే జిల్లా సమస్యలపై సమీక్ష జరపాలని ఇచ్చిన హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు . జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ పాల్గొన్నారు.