Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొడిచేడు, దాచారం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు
- రూ.4 కోట్ల అంచనా వ్యయంతో పనులకు సర్వే
- మూసీజలాల వినియోగంపై దష్టి సారించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ -మోత్కూరు
తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీటి కాల్వలు లేని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు చిన్ననీటి వనరులను అభివద్ధి చేసి సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రత్యేక దష్టి సారించారు. మోత్కూర్, అడ్డగూడూరు మండలాలను ఆనుకుని ఇరువైపులా బిక్కేరు వాగు, మూసీనది ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే బిక్కేరు వాగులో నియోజకవర్గంలో ఆరుచోట్ల చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.65 కోట్ల నిధులు మంజూరు చేయించగా పనులు 65శాతం పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని పలు మండలాలకు ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయి. మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకు సాగునీరు అందించడానికి బునాదిగాని కాల్వ పనులు చేపట్టినప్పటికీ పలు కారణాలతో ఆ పనులు స్లో అయ్యాయి. ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తక్కువ ఖర్చుతో మూసీ జలాల మళ్లింపునకు శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మూసీనదిపై తొలిసారిగా లిప్ట్ ఇరిగేషన్ చేపట్టడం విశేషం. దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు మూసీ జలాల మళ్లింపునకు మోత్కూరు మండలంలోని పొడిచేడు, దాచారం గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంచుకుని పనులు ప్రారంభించారు. లిఫ్ట్ ఇరిగేషన్ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కోసం ఖమ్మం జిల్లాకు చెందిన సర్వే ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో ఆ సర్వే ఏజెన్సీ టీం ఇటీవల ఆ రెండు గ్రామాల్లో , మూసీనదిలో రెండు రోజులు సర్వే చేశారు.
రూ.4 కోట్ల అంచనా వ్యయంతో...
రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నీటి పారుదలశాఖ అధికారులు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. దాచారం, పొడిచేడు గ్రామాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులను ప్రతిపాదించారు. ఆయా గ్రామాల్లోనే మూసీనదిలో నీటిని ఎత్తిపోయడానికి ఇంటెల్ టెక్ పంప్ హౌస్, మోటార్లు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని ద్వారా చెరువులు, కుంటలకు నీటిని మళ్లిస్తారు. ప్రస్తుతం పొడిచేడు, దాచారం గ్రామాల్లోని చెరువుల కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు సాగవుతుండగా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా రైతులు భూములు కోల్పోయే అవకాశం లేనందున పనులు కూడా త్వరగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. డీపీఆర్ రిపోర్ట్ రాగానే అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ మంజూరు కోసం నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిసింది.
సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే కషి
గోరుపల్లి శారద, జెడ్పీటీసీ, మోత్కూర్
మోత్కూర్, అడ్డగూడూరు మండలాల రైతులకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కషి చేస్తున్నారు. బిక్కేరు వాగులో ఇప్పటికే చెక్ డ్యాంలు మంజూరు చేయించి పనులు చేయిస్తున్నారు. వథాగా పోతున్న మూసీ జనాలు సాగునీటికి మళ్ళించాలన్న గొప్ప ఆలోచనతో లిఫ్ట్ ఇరిగేషన్కు శ్రీకారం చుట్టడం ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేస్తుంది.
రెండు పంటలకు నీరందుతుంది
కంచర్ల అశోక్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్, మోత్కూర్
మూసీనది లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రెండు పంటలకు నీరందుతుంది. కొన్నేళ్లుగా సాగునీటి కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నందున ఈ పనులు పూర్తి చేస్తే రెండు పంటలకు శాశ్వతంగా సాగు నీరు అందుతుంది.
రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉండదు
పేలపూడి మధు, సర్పంచ్, పొడిచేడు
మూసీలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేస్తుండటంతో రైతులు భూమి కోల్పోయే అవకాశం ఉండదు. రైతులు కూడా సుముఖంగా ఉండడంతో పనులు కూడా త్వరగా పూర్తి చేయవచ్చు.
త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం
ఎం.సత్యనారాయణ గౌడ్, ఐబీ డీఈఈ, తిరుమలగిరి సబ్ డివిజన్
మూసీ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం సర్వే ఏజెన్సీ రెండు రోజుల క్రితం సర్వే పూర్తి చేసింది. సర్వే ఏజెన్సీ వారం రోజుల్లో డీపీఆర్ ఇవ్వగానే ఐడీసీ(ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కి నివేదిక పంపుతాం. దీంతో అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, ఫైనాన్స్ అనుమతులు వస్తాయి. అనుమతులు రాగానే పనులను ప్రారంభిస్తాం.